
రెండో రోజు రెండు నాటికలు
ఖమ్మంగాంధీచౌక్: తెలుగు రాష్ట్రాల స్థాయి నాటికల పోటీల్లో కళాకారులు ప్రదర్శిస్తున్న నాటికలు ప్రేక్షకులను ఆలోచింపచేస్తున్నాయి. నెలనెలా వెన్నెల 8వ వార్షికోత్సవం సందర్భంగా ఖమ్మంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో నిర్వహిస్తున్న పోటీలు శుక్రవారం రెండో రోజుకు చేరాయి. ఈ సందర్భంగా కరీంనగర్‌కు చెందిన చైతన్య కళా భారతి బాధ్యులు ‘ఖరీదైన జైళ్లు’ నాటికను ప్రదర్శించారు. ఆధునిక సమాజంలో గ్రామీణ వాతావరనం, నగరాల్లో బ్రతుకుతున్న ప్రజల జీవన విధానాలు, ప్రేమానుబంధాల మధ్య తేడాను ఈ తేడా ద్వారా కళ్లకు కట్టినట్లు చూపారు. ఓ అపార్టుమెంట్‌లో ఉంటున్న కుటుంబంలో కొడుకు అమెరికాలో, కూతురు ముంబైలో ఉండగా తండ్రి మరణిస్తాడు. ఈ విషయం తెలిపినా పిల్లలు పనుల కారణంగా రాకపోవడంతో వాచ్‌మెన్ తలకొరివి పెట్టగా కుమారుడు, కుమార్తె ఆన్‌లైన్‌లో చూస్తూ నివాళులర్పించడం ఇతివృత్తంగా ఈ నాటిక సాగింది. అనంతరం విజయవాడకు చెందిన మైత్రి కళానిలయం వారు ‘బ్రహ్మస్వరూపం’ నాటికను ప్రదర్శించారు. స్నిగ్ధ నాటకీకరించిన ఈ నాటికకు టీవీ.పురుషోత్తం దర్శకత్వ వహించారు. ఆహ్లాదకరంగా సాగే జీవితంలో ఊహించని కష్టం చోటు ఎదురైతే జరిగే పరిణామాల ఇతివృత్తంగా ఈ నాటిక సాగింది. కాగా, రెండో రోజు పోటీలను చెరుకూరి వనశ్రీ, కాటంనేని వీరభద్రరావు, రమేష్, సంపత్, తిరుమలాచారి, వేల్పుల విజేత, అన్నాబత్తుల సుబ్రమణ్యకుమార్, డాక్టర్ నాగబత్తిని రవి, జగన్మోహన్‌రావు, సదానందం, లక్ష్మీనారాయణ ప్రారంభించారు. అనంతరం ఖమ్మం మార్కెట్ చైర్మన్ యరగర్ల హన్మంతరావు, కార్పొరేటర్, నాయకుడు తుమ్మల యుగేందర్ తదితరులు హాజరై ప్రదర్శకులకు పోత్సాహకాలు అందించారు. కాగా, నాటిక పోటీలకు శనివారం సినీ నటుడు, రచయిత తనికెళ్ల భరణి హాజరుకానున్నారని నిర్వాహకులు తెలిపారు.
పాశ్చాత్య సంస్కృతిని ప్రతిబింబించిన ‘ఖరీదైన జైళ్లు’

రెండో రోజు రెండు నాటికలు