
స్ఫూర్తి పూసుకుంట..
ఆదివాసీ గ్రామంలో సంక్షేమ, అభివృద్ధి ఫలాలు
వెదురు బొమ్మలే జీవనాధారం..
పూసుకుంట గ్రామం వెళ్లాలంటే దమ్మపేట–పాల్వంచ ప్రధాన రహదారి నుంచి దట్టమైన అడవిలో 13 కి.మీ పాటు కాలిబాటన ప్రయాణించాలి. వానాకాలం వచ్చిందంటే బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి. మిగతా కాలాల్లో కొన్ని ఆటోలు, టూ వీలర్ల ద్వారా గ్రామానికి రాకపోకలు సాగుతాయి. అటవీ శాఖ అనుమతులు రాకపోవడంతో రోడ్లు, మిషన్ భగీరథ పథకం గ్రామానికి చేరుకోలేదు. విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో వానలపై ఆధారపడి సాగే వ్యవసాయంతో పాటు వెదురు బొమ్మల తయారీనే ప్రజల ప్రధాన జీవనాధారంగా మారింది.
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఏటా ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరుపుకుంటారు. ఈ సందర్భంగా ఆదివాసీల జీవన విధానం, వారి ఆహారపు అలవాట్లు, సంస్కృతీ సంప్రదాయాల గురించి ప్రజాప్రతినిధులు, అధికారులు ఎంతో గొప్పగా చెబుతారు. ఆ రోజు గడిస్తే మళ్లీ వారి జీవితాల్లోకి రోడ్డు సౌకర్యం లేకపోవడం, కరెంటు ఉండకపోవడం, తాగునీటి కోసం తండ్లాట వంటి సమస్యలు వచ్చి చేరతాయి. వీరి జీవితాల్లో వెలుగు నింపాలని ప్రజాప్రతినిధులు గట్టిగా సంకల్పం తీసుకుంటే అధికారులు చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే సంక్షేమం, అభివృద్ధి కిరణాలు ఎంత వేగంగా ఆదివాసీ జీవితాల్లోకి వస్తాయనేందుకు.. దమ్మపేట మండలంలోని పూసుకుంట గ్రామం నిదర్శనంగా నిలుస్తోంది.
నాటి గవర్నర్ గ్రామాన్ని సందర్శించాక..
స్వాతంత్రం వచ్చిన తర్వాత దశాబ్దాలపాటు దట్టమైన అడవిలో ఉండిపోయిన ఈ గ్రామం ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలకు దాదాపుగా దూరంగా నిలిచిపోయింది. 2021 ఏప్రిల్‌లో అప్పటి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రత్యేకంగా సందర్శించడంతో ఒక్కసారిగా పూసుకుంట గ్రామం వెలుగులోకి వచ్చింది. అక్కడి ప్రజల కష్టాలను చూసి ఆమె చలించిపోయారు. తాగునీటి సౌకర్యం కోసం ఆర్వో ప్లాంటు, ఈవీ ఆటో, వెదురు బొమ్మల తయారీ శిక్షణ కేంద్రానికి నిధులు మంజూరు చేశారు. కొన్నాళ్లు పని చేసిన ఆర్వో ప్లాంటు మూతపడగా శిక్షణా కేంద్రం అలంకారప్రాయమైంది. ఈవీ ఆటో రిపేర్లకు వచ్చి మూతపడింది. అంతకుముందు చరిత్రను పరిశీలించినా కేవలం నలుగురు ఎమ్మెల్యేలు మాత్రమే గ్రామాన్ని సందర్శించారు. అది కూడా సాధారణ ఎన్నికల ప్రచారం కోసమే వచ్చినట్టుగా రికార్డులు పేర్కొంటున్నాయి. కొండరెడ్లు ఇతరులతో కలవకుండా దట్టమైన అడవుల్లో వేరుగా ఉండటం, ఓటర్ల సంఖ్య కూడా తక్కువగా ఉండటంతో అధికారులు, రాజకీయ పార్టీలు వీరిని పట్టించుకోలేదు. ఈ విషయం గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత సాక్షి కథనాల ద్వారా వెలుగులోకి వచ్చింది.
యాక్షన్ ప్లాన్
గడిచిన ఏడాది కాలంగా కొండరెడ్లు జీవిస్తున్న పూసుకుంట గ్రామంలో మౌలిక సదుపాయాలు కల్పించడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఆర్ అండ్ బీ అధికారులు, ఫారెస్టు శాఖలను సమన్వయం చేసుకుంటూ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించే పనులు ఈ ఏడాది జనవరిలో మొదలెట్టారు. ప్రస్తుతం రూ. 5 కోట్ల వ్యయంతో మూడు వంతెనల నిర్మాణం పూర్తికాగా, రోడ్డు పనులు కంకర పరిచే దశలో ఉన్నాయి. కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ఆధ్వర్యంలో ఇంటింటా సర్వే నిర్వహించి, వారి నైపుణ్యం ఆధారంగా తేనెటీగల పెంపకం, టెంట్ హౌస్, రెండు పవర్ టిల్లర్లు మంజూరు చేశారు. వ్యవసాయం చేస్తున్న 20 కుటుంబాలకు 12 బోర్లను ఉచితంగా మంజూరు చేశారు. 22 కుటుంబాలకు ఇళ్లను మంజూరు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్సుగా ఉపయోగించుకునేందుకు వీలుగా గతంలో మూలన పడిన ఈవీ ఆటోను రిపేర్ చేయించి అందుబాటులోకి తెచ్చారు.
నామ్‌కే వాస్తేగా కాకుండా
ఆర్థికంగా, సాంఘికంగా వెనుకబడిన గిరిజనులు, ఆదివాసీల అభ్యున్నతి కోసం ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెడుతోంది. ఐటీడీఏల పేరుతో ప్రత్యేక సంస్థలను నెలకొల్పి అనేక పథకాలను అందుబాటులో ఉంచింది. క్షేత్రస్థాయిలో పరిస్థితులకు అనుగుణంగా కొన్ని పథకాలు లేకపోవడం, మరికొన్ని కాలానుగుణంగా మారకపోవడంతో ఆశించిన ప్రయోజనం నెరవేరడం లేదు. గిరిజన సంక్షేమం, అభివృద్ధి కోసం చేస్తున్న వ్యయం అంతా బినామీలకు, గుత్తేదారులవశం అవుతుందనే విమర్శలు ఉన్నాయి. ఆదివాసీల పల్లెల్లోకి వెళ్లి వారి జీవితాలను, ఆర్థిక స్థితిగతులను దగ్గరుండి పరిశీలించి పథకాలు అమలు చేస్తే మార్పు త్వరితగతిన వస్తుందనే అభిప్రాయానికి పూసుకుంట గ్రామం వేదికగా మారింది.
పీవీటీజీలుగా కొండరెడ్లు
ఆదివాసీల్లో కోయ, గోండు, గొత్తికోయ తదితర జాతులు ఎన్నో ఉన్నాయి. వీరిలో బాగా వెనుకబడిన జాతుల్లో కొండరెడ్లు ఉన్నారు. ఆదివాసీల్లో ఎక్కువ శాతం అడవుల్లో జీవించేందుకు ఇష్టపడితే, ఆ అడవుల్లో కొండలపైనే జీవించడం కొండరెడ్ల ప్రత్యేకత. కొండ కిందకు తీసుకువచ్చేందుకు చేసిన ప్రయత్నాల వల్ల ప్రస్తుతం కొండరెడ్లు కిందకు వచ్చి అడవిలోనే ఊళ్లను ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నారు. కొండరెడ్లను ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్ (అరుదైన ఆదిమజాతి)గా 1975లో కేంద్రం గుర్తించింది. ఆ తర్వాత కాలంలో వీరి జనాభా వేగంగా తగ్గిపోతుండటంతో 2006లో కొండరెడ్లను పీవీటీజీ (పర్టిక్యూలర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్) కేటగిరీలోకి మార్చారు.
పాలకులు, అధికారులు చిత్తశుద్ధితో పనిచేస్తే ప్రగతి
గిరిజనుల సామాజిక జీవనం మెరుగుపడే అవకాశం

స్ఫూర్తి పూసుకుంట..

స్ఫూర్తి పూసుకుంట..