మిగులు భూమి ఎంత? | - | Sakshi
Sakshi News home page

మిగులు భూమి ఎంత?

Aug 9 2025 5:55 AM | Updated on Aug 9 2025 5:55 AM

మిగుల

మిగులు భూమి ఎంత?

కేటాయింపులు, ఆక్రమణలు

ఎన్నెస్పీ ప్రధాన కాల్వపైనే పాలేరు నుంచి ఏన్కూరు వరకు ఖమ్మం చుట్టుపక్కల సుమారు 368ఎకరాల భూమిని రెవెన్యూ శాఖకు అప్పగించారు. ఇందులో దానవాయిగూడెం కాలనీ, మద్దులపల్లి మార్కెట్‌ ఏర్పడ్డాయి. ఇక మున్నేరు రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణంతో భూములు, ఇళ్లు కోల్పోతున్న వారికి కొంతమేర స్థలాలు ఇచ్చేందుకు గుర్తించారు. ఖమ్మం నడిబొడ్డున మేజర్‌ కాల్వ ఐదున్నర కి.మీ. పొడవుతో టేకులపల్లి వంతెన నుంచి చైతన్యనగర్‌, వరదయ్యనగర్‌, మధురానగర్‌ కాలనీ ధంసలాపురం వరకు ఉండేది. కానీ ఇప్పుడు కేవలం కి.మీ. నిడివి ద్వారా మాత్రమే లకారం చెరువులోకి నీరు చేరేందుకు ఉపయోగపడుతోంది. మిగతా భాగమంతా ఆక్రమణలకు గురికాగా.. ఇంకొంత క్రమబద్ధీకరణతో ఇతరుల పరమైంది. అలాగే, కాల్వ భూములను రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు ఆక్రమించి ప్లాట్లుగా మార్చేసిన ఉదంతాలు కూడా వెలుగు చూశాయి. దీంతో ఇప్పుడు కాల్వలు, స్థలాల గుర్తింపు కష్టంగా మారింది చెబుతున్నారు.

ఖమ్మంఅర్బన్‌: రాష్ట్రవ్యాప్తంగా జలవనరుల శాఖ పరిధిలోని భూముల గుర్తింపునకు కసరత్తు మొదలైంది. ఆయా భూముల లెక్కలు తేల్చి రక్షణ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇటీవల ఆదేశించారు. దీంతో జిల్లాలోనూ అధికారులు మిగులు భూముల లెక్కల వివరాలపై ఆరా తీస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు(ఎన్నెస్పీ) పరిధి కాల్వల నిర్మాణ సమయాన రైతుల నుంచి భారీగా భూములు సేకరించారు. జిల్లాలోని 17 మండలాల పరిధిలో భూములు సేకరించగా.. కాల్వలు తవ్వకం, క్యాంప్‌లు, క్వార్టర్లు, ఇతర నిర్మాణాలకు పోగా మిగిలిన భూములు ఎక్కడెక్కడ, ఎంత మేర ఉన్నాయని సబ్‌ డివిజన్ల వారీగా నివేదిక తయారు చేస్తున్నారు.

239 కి.మీ. మేర కాల్వలు

జిల్లాలో సాగర్‌ ప్రధాన కాల్వ, బ్రాంచ్‌ కాలువలు కలిపి 239 కి.మీ. మేర విస్తరించి ఉన్నాయి. వీటితోపాటు మేజర్లు, మైనర్లకు సైతం అప్పట్లో రైతుల నుంచి భూములు సేకరించారు. అయితే, అవసరానికి మించి చాలాచోట్ల ఎక్కువ వైశాల్యం గల భూములు సేకరించినట్లు అంచనా. డీప్‌ కట్‌ ప్రాంతాల్లో మట్టి పోసేందుకు, క్యాంప్‌లు, యంత్రాల నిల్వ కోసం ఇలా సేకరించినట్లుసమాచారం. బోనకల్‌ బ్రాంచ్‌, మధిర బ్రాంచ్‌, 16–17 బ్రాంచ్‌ కాల్వల పరిధిలో భారీగా భూసేకరణ జరిగినట్లు తెలిసింది.

క్యాంపుల నిర్మాణం

విధినిర్వహణకు వచ్చే ఎన్నెస్పీ ఉద్యోగుల కోసం ఖమ్మం, వైరా, నేలకొండపల్లి, తల్లాడ, కల్లూరు, పెనుబల్లి, ఏన్కూరు, తిమ్మారావుపేట, బసవాపురం తదితర ప్రాంతాల్లో క్యాంపులు నిర్మించారు. అలాగే, ఉద్యోగులు, సిబ్బంది ఉండేలా క్వార్టర్ల నిర్మాణం సైతం జరిగింది. ఆతర్వాత మిగులు భూముల్లో కొన్నేళ్ల నుంచి ప్రభుత్వ కార్యాలయాలు, వసతి గృహాలు, గురుకుల పాఠశాలలు, మార్కెట్‌ యార్డులకు కేటాయిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఆక్రమణలు సైతం జరగగా.. ప్రభుత్వమే 59 జీఓ ద్వారా క్రమబద్ధీకరించడంతో ఎన్నెస్పీ భూములు కుంచించుకుపోయాయి.

పేరుకే క్యాంప్‌..

ఖమ్మం నగర నడిబొడ్డున ఉన్న ఎన్నెస్పీ క్యాంపులో మొత్తం 96 ఎకరాల భూమి జలవనరుల శాఖ పరిధిలో ఉంది. కానీ ఇది రికార్డుల్లో మాత్రమే కనిపిస్తోంది. ఈ భూమిలో 80 ఎకరాలకు పైగా వివిధ ప్రభుత్వ శాఖలు, రాజకీయ పార్టీ కార్యాలయాలు, ప్రార్థనా మందిరాలకు కేటాయించారు. ఇదే స్థలంలో ఆర్‌టీసీ, ఆర్‌టీఓ, ఎల్‌ఐసీ, డీపీఓ, ఆర్‌డబ్ల్యూఎస్‌ తదితర కార్యాలయాలు కొనసాగుతున్నాయి. ఇక పట్టాదారులు కొందరు అప్పటి ఎన్నెస్పీ అధికారుల ద్వారా తమ పట్టా భూములు మిగులుగా ఉన్నాయని కొంతమేర తీసుకున్నట్లు సమాచారం. అన్నీ పోగా క్యాంప్‌లో ప్రస్తుతం 16 ఎకరాలే జలవనరుల శాఖ పేరున మిగిలి ఉండొచ్చని అంచనా.

భవిష్యత్‌ అవసరాల కోసం...

ప్రభుత్వ విద్యాసంస్థలు, కార్యాలయాలు నిర్మించేందుకు భూమి అవసరమైనప్పుడు వెతకాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ఈ నేపథ్యాన మిగులు భూములపై సమగ్ర సర్వే చేసి నివేదిక సమర్పించాలని ఆదేశాలు అందాయి. దీంతో జిల్లాలోని జలవనరుల శాఖ మిగులు భూములను పూర్తిస్థాయిలో గుర్తించడంలో నిమగ్నమయ్యారు. ఇదేసమయాన ఆక్రమణలు, కేటాయింపులు, ప్రభుత్వ వినియోగం తదితర వివరాలను కూడా నివేదికలో పొందుపర్చనున్నట్లు తెలిసింది.

జలవనరుల శాఖ స్థలాలపై ఆరా

సబ్‌ డివిజన్ల వారీగా లెక్కలు తీస్తున్న యంత్రాంగం

ఖమ్మం ఎన్నెస్పీ క్యాంపులో మిగిలింది 16 ఎకరాలే?

మిగులు భూమి ఎంత?1
1/1

మిగులు భూమి ఎంత?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement