
ప్రభుత్వ వైద్యంపై నమ్మకం పెరగాలి
● జిల్లా ఆస్పత్రి పరిసరాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దండి ● మరింత వేగంగా క్రిటికల్ కేర్ బ్లాక్ నిర్మాణ పనులు ● హెచ్‌డీఎస్ సమావేశంలో కలెక్టర్ అనుదీప్
ఖమ్మంవైద్యవిభాగం: ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజలకు నమ్మకం పెరిగేలా వైద్యులు, సిబ్బంది విధులు నిర్వర్తించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో కలెక్టర్ అధ్యక్షతన శుక్రవారం హాస్పిటల్ డెవలప్‌మెంట్ సొసైటీ(హెచ్‌డీఎస్) సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ‘సుడా’ నిధులు రూ.25కోట్లతో ఆస్పత్రిలో 13 అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. ఇందులో 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ పనులు త్వరగా పూర్తిచేయడంతో పాటు తక్కువ ఖర్చుతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేలా కావాల్సిన యంత్రాలు సమకూరుస్తామని చెప్పారు. అలాగే, టాయిలెట్ల మరమ్మతు పూర్తిచేసి, అందుబాటులో ఉన్న యంత్రాల పనితీరు, సీసీ రోడ్ల మరమ్మతుకు అవసరమైన నిధులపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఇదే సమయాన ఆస్పత్రి పరిసరాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ అనుదీప్‌సూచించారు.
పలు విభాగాల పనితీరుపై సీరియస్
ఆస్పత్రిలో పలు విభాగాల్లో పనితీరుపై కలెక్టర్ అనుదీప్ సీరియస్ అయ్యారు. ఆస్పత్రిలో 259 మంది కార్మికులు ఉన్నా అధికారుల పర్యవేక్షణ లోపంతో సగం మందే పనిచేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని తెలిపారు. పేషంట్ కేర్, సెక్యూరిటీ, శానిటేషన్ కాంట్రాక్ట్ గడువు ఈ నెలతో ముగుస్తున్నందున 50 మందికి ఒక సూపర్‌వైజర్ చొప్పున బాధ్యతలు అప్పగించి పనులు చేయించాలని సూచించారు. అలాగే, శస్త్రచికిత్సలు సాఫీగా జరిగేలా పరికరాల మరమ్మతు అవసరమైతే చేయించాలని తెలిపారు. అంతేకాక రోగులతో ప్రవర్తన, వైద్యులు, సిబ్బంది సమయపాలనపై కలెక్టర్ సూచనలు చేశారు. ఖమ్మం మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, ఆస్పత్రి సూపరింటెండెంట్ ఎం.నరేందర్, డీఎంహెచ్‌ఓ కళావతిబాయి, డీసీహెచ్‌ఎస్ రాజశేఖర్, వైద్య శాఖ ఈఈ ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.