మతం పేరుతో కల్లోలం సృష్టిస్తున్నారు
తిరుమలాయపాలెం: మతాన్ని అడ్డుపెట్టుకుని కేంద్రంలో మూడుసార్లు అధికారంలోకి వచ్చిన బీజేపీ.. దేశంలో అల్లకల్లోలం సృష్టిస్తోందని, అలాంటి ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మండలంలోని బచ్చోడులో ఆదివారం నిర్వహించిన జై బాపు.. జై భీమ్.. జై సంవిధాన్ ర్యాలీకి ఆయన హాజరై మాట్లాడారు. దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన మహనీయుల జ్ఞాపకాలను, అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని బీజేపీ అపహాస్యం చేస్తోందని ఆరోపించారు. ఆ రాజ్యాంగం లేకుంటే ప్రజలకు ఇప్పుడు మాట్లాడే స్వేచ్ఛ కూడా ఉండేది కాదన్నారు. అధికారం కోసం బీజేపీ ప్రాంతాలు, మతాల మధ్య చిచ్చు పెడుతూ, అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. కేంద్రంలో అధికారంలో ఉంటే ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనే మత్తులో రాష్ట్రాలను చిన్నాభిన్నం చేస్తోందని, ఆ పార్టీకి కనువిప్పు కలిగించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని చెప్పారు.
హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాం..
ప్రజలకు ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మండలంలోని బచ్చోడు, రాజారం, సోలీ పురం, కాకరవాయి గ్రామాల్లో నిర్మిస్తున్న బీటీ రోడ్డు పనులకు ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. సోలీపురంలో హజ్రత్ మన్సూర్ షావలి దర్గాను దర్శించి చాదర్ సమర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 200 యూనిట్ల వరకు పేదలకు ఉచిత గృహ విద్యుత్, రూ. 500కే గ్యాస్ సిలిండర్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గురుకులాల్లో డైట్, కాస్మోటిక్ చార్జీల పెంపు వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని వివరించారు. గత ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయంగా ఎకరాకు రూ.10వేలు ఇస్తే తమ ప్రభుత్వం రూ.12 వేల కు పెంచిందన్నారు. వారం రోజుల్లో రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమవుతాయని చెప్పారు. ఆయా కార్యక్రమాల్లో పంచాయతీరాజ్ ఎస్‌ఈ వెంకటరెడ్డి, ఈఈ మహేష్, డీఈ వేణుగోపాల్, ఎన్పీడీసీఎల్ ఎస్‌ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి, ఖమ్మం ఆర్డీఓ నరసింహారావు, ఏడీఏ సరిత, ఏఓ సీతారాంరెడ్డి, ఎంపీడీఓ సిలార్ సాహెబ్, తహసీల్దార్ విల్సన్, డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, నాయకులు స్వర్ణకుమారి, తుంబూరు దయాకర్‌రెడ్డి, మద్ది శ్రీనివాసరెడ్డి, బెల్లం శ్రీనివాస్, అరవిందరెడ్డి, నరేష్‌రెడ్డి, చావా శివరామకృష్ణ, బుద్దా కనకయ్య, అశోక్, మంగీలాల్ తదితరులు పాల్గొన్నారు.
బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలి
రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
బచ్చోడులో ‘జై బాపు..జై భీమ్..
జై సంవిధాన్’ కార్యక్రమం


