రెవెన్యూ సదస్సులతో భూ సమస్యలు పరిష్కారం
● ఆయిల్‌పామ్ వంటి లాభసాటి పంటలు సాగు చేయాలి ● రైతులకు కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సూచన
వైరారూరల్: రెవెన్యూ సదస్సులతో భూసమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ అన్నారు. మండలంలోని పూసలపాడులో గురువారం నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సులో ఆయన మాట్లాడారు. సాదాబైనామా దరఖాస్తులు పరిష్కరించే క్రమంలో క్షేత్రస్థాయికి వెళ్లి భూమి ఎవరి కబ్జాలో ఉందో పరిశీలించాలని అధికారులకు సూచించారు. ఆయా దరఖాస్తులను హైకోర్టు తీర్పు ప్రకారం పరిష్కరిస్తామన్నారు. జిల్లాలో 600 మంది ప్రైవేట్ లైసెన్స్‌డ్ సర్వేయర్లకు శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. త్వరలో గ్రామకంఠ సర్వేలు నిర్వహించి అసైన్మెంట్ భూములు పేదల వద్ద ఉంటే వారికి పట్టాలు ఇవ్వాలనే యోచనలో సర్కారు ఉందని తెలిపారు. భూ హక్కుల రికార్డులపై ప్రజలకు ఏమైనా అభ్యంతరాల పరిష్కారానికి తహసీల్దార్ నుంచి సీసీఎల్‌ఏ వరకు రెవెన్యూ కోర్టు వ్యవస్థ ఏర్పాటైందని, పైసా ఖర్చు లేకుండా భూ వివాదాలు పరిష్కారం అవుతాయని వివరించారు. రైతులు సంప్రదాయ పంటలే కాకుండా ఆయిల్ పామ్ వంటి లాభసాటి పంటలు సాగు చేయాలని సూచించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ ఫలితాలు..
ప్రైవేట్ స్కూళ్ల కంటే మెరుగ్గా ప్రభుత్వ పాఠశాలల్లో ఫలితాలు వస్తున్నాయని, ప్రభుత్వ విద్యపై నమ్మకం ఉంచి తల్లిదండ్రులు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కలెక్టర్ కోరారు. మండలంలోని నారపునేనిపల్లి యూపీఎస్‌లో నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పాఠశాలలో ఇంగ్లిష్ మీడియం విద్యా బోధన ఏర్పాటు చేశామని చెప్పారు. విద్యార్థులను పాఠశాలకు తరలించేందుకు 7 సీటర్ ఆటోలను ఉదయం, సాయంత్రం ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో స్పోకెన్ ఇంగ్లిష్ కోర్సులు ఏర్పాటు చేస్తున్నామని, 6 నెలల్లో స్పష్టమైన మార్పు వస్తుందని అన్నారు. ఆయా కార్యక్రమాల్లో డీఈఓ సామినేని సత్యనారాయణ, తహసీల్దార్ కె.వి. శ్రీనివాసరావు, ఎంపీడీఓ పి.సరస్వతి, ఎంఈఓ కొత్తపల్లి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
అడ్మిషన్ల పెంపునకు బడిబాట
ఖమ్మంగాంధీచౌక్: ప్రభుత్వ పాఠశాలల్లో బడిబాట ద్వారా అడ్మిషన్లు పెంచాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. ఇందిరా డెయిరీ ఏర్పాటుకు రూపొందించిన ప్రణాళికను అమలు చేయాలన్నారు. ఈ రెండు అంశాలపై సంబంధిత అధికారులతో గురువారం ఐడీఓసీలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న వసతులు, నూతనంగా చేపట్టిన ఉపాధ్యాయుల నియామకం తదితర అంశాలను తల్లిదండ్రులకు వివరించి అడ్మిషన్ల సంఖ్య పెంచాలని సూచించారు. పక్కా ప్రణాళికతో ఇందిరా డెయిరీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. లక్ష్యం మేరకు గేదెల యూనిట్లు గ్రౌండింగ్ చేయాలని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ పి. శ్రీజ, జెడ్పీ సీఈఓ దీక్షారైనా, డీఆర్డీఓ సన్యాసయ్య, డీఈఓ సత్యనారాయణ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ నవీన్‌బాబు, ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమాధికారులు కె.సత్యనారాయణ, జ్యోతి, విజయలక్ష్మి, పురంధర్, జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ శ్రీనివాస రెడ్డి పాల్గొన్నారు.


