
ఫార్మర్ ఐడీలో ఫస్ట్..
ఖమ్మంవ్యవసాయం : ఫార్మర్ ఐడీ(రైతు గుర్తింపు) రిజిస్ట్రేషన్ల నమోదు ప్రక్రియలో జిలా అగ్రగామిగా నిలిచింది. వ్యవసాయ రంగాన్ని పూర్తి స్థాయిలో డిజిటలైజేషన్ చేయడమే లక్ష్యంగా రూపొందించిన ఫార్మర్ ఐడీ ప్రాజెక్ట్ ఈనెల 5న ప్రారంభం కాగా, ఇప్పటి వరకు నమోదులో రాష్ట్రంలోనే జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ రంగం ఉన్న 32 జిల్లాల్లో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ పథకం నిబంధనల ఆధారంగా జిల్లాలో 3,40,072 మంది రైతులు అర్హులు ఉన్నారు. వీరిలో మే 17 నాటికి 45,450 మంది రైతులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వీరిలో ఇప్పటికే 35,017 మంది రైతులకు ఫార్మర్ ఐడీ జనరేట్ అయింది. ఈ రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో రెండో స్థానంలో రాజన్న సిరిసిల్ల, మూడో స్థానంలో కరీంగనర్, నాలుగో స్థానంలో కామారెడ్డి, ఐదో స్థానంలో నిజామాబాద్ జిల్లాలు నిలవగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 17వ స్థానానికి పరిమితమైంది. చివరి స్థానంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఉంది.
అవగాహనతోనే వేగవంతం..
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఫార్మర్ ఐడీపై రైతులకు అవగాహన కల్పించడంతో ఈ ప్రక్రియ వేగవంతంగా సాగుతోంది. కేంద్రం రూపొందించిన పథకాల అమలుకు ఈ ప్రాజెక్ట్‌ను రూపొందించారు. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ యోజన, సాయిల్ హెల్త్ కార్డు, ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన, భారత ఆహార భద్రత మిషన్, రాష్ట్రీయ కృషి వికాస యోజన వంటి పథకాల అమలులో ఈ ఐడీ కార్డు కీలకం కానుంది. కేంద్రం అమలు చేస్తున్న పథకాలను పారదర్శకంగా రైతుల దరి చేర్చడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టును అమలు చేస్తున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న ‘రైతుల ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమంలో వానాకాలం పంట సాగు అంశాలను వివరించడంతో పాటు ఫార్మర్ ఐడీతో ప్రయోజనాలు, రిజిస్ట్రేషన్ ప్రాముఖ్యతను కూడా వివరిస్తుండగా ప్రక్రియ వేగవంతానికి ఇవి దోహదం చేస్తున్నాయి.
భూమి, పంటల సాగు వివరాలు నమోదు..
ఫార్మర్ ఐడీ ప్రక్రియలో రైతులకు ఉన్న భూమి వివరాలు సర్వే నంబర్ల వారీగా నమోదవుతాయి. భూమి రకం, ఆయా భూముల్లో సాగు చేసే పంటలను కూడా పొందుపరుస్తారు. డిజిటల్ విధానంలో వ్యవసాయ విస్తరణాధికారులు ఈ ప్రక్రియను నిర్వహిస్తున్నారు. జిల్లాలోని 129 క్లస్టర్లలో ఈ ప్రక్రియ నిరంతరాయంగా సాగుతోంది. రైతు వేదికల్లో నిర్వహించే ఈ ప్రక్రియకు రైతులు తరలివస్తూ ఫార్మర్ ఐడీ కోసం తమ భూములు, పటల సాగు వివరాలు చెబుతూ పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. అందుబాటులో లేని కొందరు రైతులు మీ సేవా కేంద్రాల్లోనూ రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు.
రైతు గుర్తింపు నమోదులో జిల్లా ముందంజ
పది రోజల్లో 45 వేల మంది రిజిస్ట్రేషన్
35 వేల మందికి గుర్తింపు కార్డులు సిద్ధం
జూన్ 5 వరకు పూర్తి స్థాయిలో అర్హుల రిజిస్ట్రేషన్, ఐడీ కార్డుల జారీ
ఫార్మర్ ఐడీకి ఎంతో ప్రాధాన్యం
ఫార్మర్ ఐడీకి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ కార్డు ఆధారంగానే కేంద్ర పథకాలు అందుతాయి. కార్డు లేనివారు ఆ పథకాలకు దూరమయ్యే ప్రమాదం ఉంది. రైతులు తప్పనిసరిగా నిర్దేశిత గడువు లోగా ఏఈఓలను సంప్రదించి భూములు, పంటల సాగు వివరాలను తెలిపి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి.
– ధనసరి పుల్లయ్య, జిల్లా వ్యవసాయాధికారి