
జమలాపురం ఆలయంలో ప్రత్యేక పూజలు
ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. తెల్లవారుజామున స్వామి మూలవిరాట్‌తో పాటు ఆలయ ప్రాంగణంలోని శ్రీవారి పాదానికి పంచామృతంతో అభిషేకం నిర్వహించారు. ఆతర్వాత స్వామి, అలివేలు మంగ, పద్మావతి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి తెలంగాణ, ఏపీ నుంచి భారీగా హాజరైన భక్తుల సమక్షాన నిత్యకల్యాణం, పల్లకీ సేవ చేశారు. పెళ్లిళ్ల సీజన్‌కు తోడు పాఠశాలలకు సెలవులు కావడంతో స్వామి దర్శనానికి భక్తులు బారులుదీరారు. ఆలయ ఈఓ జగన్మోహన్‌రావు, వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల శ్రీరామచంద్రమూర్తి, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, సూపరింటెండెంట్ విజయకుమారి, అర్చకులు రాజీవ్‌శర్మ, మురళీమోహన్‌శర్మ, సిబ్బంది పాల్గొన్నారు.
పశువుల అక్రమ రవాణాపై సమాచారం ఇవ్వండి
ఖమ్మంక్రైం: పశువుల అక్రమ రవాణా జరుగుతున్నట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని పోలీస్ కమిషనర్ సునీల్‌దత్ సూచించారు. అంతేతప్ప సంస్థల బాధ్యులు చట్టాన్ని అతిక్రమించి వాహనాలను అడ్డుకుంటే చర్యలు తీసుకుంటామని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. పశువుల రవాణా విషయంలో వివాదాలు తలెత్తకుండా ఇప్పటికే ఏడు చెక్ పోస్టులు ఏర్పాటుచేశామని వెల్లడించారు. చట్టవిరుద్ధంగా ఆవులు, దూడలను రవాణా చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా తనిఖీలు చేస్తున్నామని తెలిపారు. బక్రీద్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంతంగా పండుగ జరుపుకునేలా అవసరమైన చోట్ల కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు సీపీ వివరించారు.
వర్షాలు వచ్చేలోగా
మరమ్మతులు పూర్తి
కూసుమంచి: పాలేరులోని మినీ హైడల్ ప్రాజెక్టు(జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం)లో మరమ్మతులను వర్షాలు మొదలయ్యేలోగా పూర్తిచేయాలని జెన్‌కో నాగార్జునసాగర్ ప్రాజెక్టు సీఈ(ఓఅండ్‌ఎం) మంగేష్ కుమార్ ఆదేశించారు. ప్రాజెక్టు పనులను శనివారం పరిశీలించిన ఆయన ఉద్యోగులకు సూచనలు చేశారు. షెడ్యూల్డ్ ప్రకారం పనులు చేపట్టి వర్షాలు మొదలుకాగానే విద్యుత్ ఉత్పత్తి జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం ప్రాజెక్టుకు నీటిని సరఫరా చేసే కాలువ కట్ట కొట్టుకుపోయిన చోట మరమ్మతులను కూడా సీఈ పరిశీలించారు.
ప్రజలకు సౌకర్యంగా వీధివ్యాపారుల ప్రాంగణం
ఖమ్మంమయూరిసెంటర్: మౌలిక వసతుల కల్పనలో రాజీ పడకుండా ప్రజలకు అసౌకర్యం లేకుండా వీధి వ్యాపారుల ప్రాంగణాన్ని తీర్చిదిద్దలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆదేశించారు. ఖమ్మం పాత బస్టాండ్ ఎదురుగా ఉన్న వీధి వ్యాపారుల ప్రాంగణాన్ని శనివారం తనిఖీ చేసిన ఆయన వ్యాపారులతో మాట్లాడారు. మార్చి 12న కలెక్టర్ తనిఖీ చేసినప్పుడు వెల్లడైన సమస్యల పరిష్కారంపై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు సూచనలు చేశారు. ఇందులో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనులు, నిర్మిస్తున్న షెడ్లను పరిశీలించి నాణ్యత ప్రమాణాల ప్రకారం గడువులోగాపనులు పూర్తిచేయాలని తెలిపారు. కలెక్టర్ వెంట మున్సిపల్ ఈఈ కృష్ణలాల్, అధికారులు ఉన్నారు.

జమలాపురం ఆలయంలో ప్రత్యేక పూజలు