
వృద్ధురాలు అదృశ్యం
చింతకాని/కొణిజర్ల: ఆస్పత్రికి బయలుదేరిన వృద్ధురాలు కానరాకుండా పోయిన ఘటన ఇది. చింతకాని మండలం కోమట్లగూడెంకు చెందిన బొగ్గుల కాశమ్మ(65) గురువారం ఉదయం ఆటోలో కొణిజర్లలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లి, అక్కడ వైద్యుడు లేకపోవడంతో బయటకు వచ్చింది. తొలుత ఆమె పెద్దగోపతి గ్రామీణ వికాస బ్యాంకులో రూ.5వేలు విత్‌డ్రా చేసినట్లు తెలియగా, ఆతర్వాత ఇంటికి రాలేదు. ఎక్కడ వెతికినా ఆచూకీ లేకపోవడంతో ఆమె కుమారుడు సీతారాంరెడ్డి శుక్రవారం కొణిజర్ల, చింతకాని పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదు చేశారు.
చెరువులో విషం కలపడంతో చేపలు మృతి
నేలకొండపల్లి: మండలంలోని ఆరెగూడెం చెరువులో గుర్తు తెలియని వ్యక్తులు విషం కలపడంతో శుక్రవారం చేపలు మృతువాత పడ్డాయి. ఈ ఘటనలో దాదాపు రెండు టన్నుల మేర చేపలు చనిపోయి తేలిపోయాయి. ఈమేరకు మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు బోయిన వెంకటేశ్వర్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.