
ఇటు దరఖాస్తులు
అటు సదస్సులు..
పైలట్‌గా బోనకల్ మండలంలోనూ ‘భూభారతి’
● ఈనెల 16వ తేదీ వరకు కొనసాగనున్న సదస్సులు ● ఇప్పటివరకు 1,255 దరఖాస్తులు.. చకచకా విచారణ ● మొదటి మండలం నేలకొండపల్లిలో కొనసాగుతున్న పరిశీలన, పరిష్కారం
బోనకల్
సాక్షిప్రతినిధి, ఖమ్మం: భూభారతి చట్టానికి సంబంధించి జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా తొలి దఫాలో నేలకొండపల్లి మండలాన్ని ఎంపిక చేసి సమస్యలపై దరఖాస్తులు స్వీకరించారు. ఇక రెండో దశలో బోనకల్ మండలాన్ని ప్రకటించిన నేపథ్యాన రెవెన్యూ గ్రామాల వారీగా సదస్సులు నిర్వహిస్తున్నారు. మరోపక్క తహసీల్దార్ కార్యాలయంలోనూ దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. బోనకల్ మండలంలో ఈనెల 5న మొదలైన సదస్సులు 16వ తేదీ వరకు కొనసాగతున్నాయి. ఇప్పటివరకు రైతులు తమ సమస్యలపై 1,255 దరఖాస్తులు అందించగా, రికార్డులు, క్షేత్రస్థాయి పరిస్థితుల ఆధారంగా అధికారులు పరిశీలిస్తున్నారు. కాగా, మొదట పైలట్ ప్రాజెక్టుగా ఎంపికై న నేలకొండపల్లి మండలంలో కూడా దరఖాస్తుల పరిశీలన చేపడుతుండగా, ఇప్పటివరకు 146 దరఖాస్తులు పరిష్కరించారు.
అత్యధికంగా మోటమర్రిలో...
బోనకల్ మండలంలో రెవెన్యూ సదస్సుల ద్వారా ఇప్పటి వరకు1,255 దరఖాస్తులు అందాయి. అత్యధికంగా మోటమర్రి నుంచి 167 దరఖాస్తులు రాగా, పెద్దబీరవల్లిలో 156 వచ్చాయి. అలాగే, కలకోటలో 118, నారాయణపురంలో 99, తూటికుంటలో 91, లక్ష్మీపురంలో 89, చిరునోములలో 85, చొప్పకట్లపాలెంలో 79, గోవిందాపురం(ఎల్)లో 69, గార్లపాడులో 67, రాయన్నపేటలో 61, బోనకల్‌లో 58 దరఖాస్తులు అందాయి. అంతేకాక రామాపురంలో 45, జానకీపురంలో 42 దరఖాస్తులు అందగా.. సీతానగరంలో కేవలం 29దరఖాస్తులే సమర్పించారు. కాగా, సాగులో ఉన్న భూమి కన్నా పాస్ పుస్తకంలో తక్కువగా నమోదైందని, నిషేధిత జాబితాలో భూమి ఉందని, పట్టాదారు పేరు, విస్తీర్ణం, సర్వేనంబర్ సవరణ తదితర సమస్యలపై ఎక్కువ దరఖాస్తులు అందాయని తెలుస్తోంది. కాగా, సిబ్బంది తక్కువగా ఉండటంతో సకాలంలో దరఖాస్తులను పరిశీలించడం సాధ్యం కావడం లేదని చెబుతున్నారు. ఈమేరకు డిప్యూటీ తహసీల్దార్లు, సీనియర్ అసిస్టెంట్, ఆర్‌ఐలు, మండల సర్వేయర్లను అదనంగా కేటాయించాలని కోరుతూ ఇప్పటికే కలెక్టర్‌కు తహసీల్దార్ లేఖ రాశారు. అదనపు సిబ్బందిని కేటాయిస్తే దరఖాస్తుల నమోదుతోపాటు క్షేత్రస్థాయి పరిశీలన త్వరగా పూర్తయ్యే అవకాశముంది.
నేలకొండపల్లి మండలంలో..
తొలిదఫా పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్న నేలకొండపల్లి మండలంలో 3,224 మంది రైతులు తమ సమస్యలపై దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 1,726 దరఖాస్తులు సాదాబైనామా కోసమే వచ్చాయి. అయితే, వివిధ కారణాలతో వీటి పరిశీలన ప్రారంభం కాలేదు. మిగతా సమస్యలపై అందిన 1,498 దరఖాస్తుల పరిశీలన మాత్రం కొనసాగుతోంది. సాగులో ఉన్న భూమి కన్నా పాస్ పుస్తకంలో తక్కువగా నమోదైందని, విస్తీర్ణం, సర్వేనంబర్ సవరించాలని, కొత్త పాస్ పుస్తకం ఇవ్వాలని కోరడమే కాక అసైన్డ్ భూమి సమస్యలపై దరఖాస్తులు వచ్చినట్లు చెబుతున్నారు. ఇందులో 581 దరఖాస్తులను ఇప్పటివరకు పరిశీలించిన బృందాలు 435 దరఖాస్తుల ను తిరస్కరించి, 146 దరఖాస్తులను పరిష్కరించా యి. జిల్లాలో పైలట్ ప్రాజెక్టులుగా ఎంపికై న నేలకొండపల్లి, బోనకల్ మండలాల్లో భూసమస్యలు పరిష్కారమైతే మిగతా ప్రాంతాల్లోనూ అమలుకు శ్రీకారం చుట్టనున్నారు. మరోపక్క సాదా బైనామా దరఖాస్తులపై ప్రభుత్వ నిర్ణయం వెలువడాల్సి ఉంది.