
మోడల్ నియోజకవర్గంగా మధిర
ఎర్రుపాలెం/బోనకల్: ధనిక రాష్ట్రమైన తెలంగాణలో పాలన చేపట్టిన బీఆర్‌ఎస్ పదేళ్ల కాలంలో పేదల సంక్షేమం, అభివృద్ధిని విస్మరించిందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. ఈక్రమాన అప్పుల భారం ఉన్నా, ఆదాయం సరిపడా లేకున్నా తాము అధికారంలోకి రాగానే అభివృద్ధి పనులతో పాటే సంక్షేమ పథకాలను నిరంతరాయంగా చేడుతున్నామని తెలిపారు. ఎర్రుపాలెంలో రూ.22 కోట్ల వ్యయంతో నిర్మించే 50 పడకల ఆస్పత్రికి కలెక్టర్ ముజ్మమిల్‌ఖాన్‌తో కలిసి బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు. అలాగే, రూ.2.62 కోట్లతో నిర్మించే కండ్రిక – పెద్దగోపవరం బీటీ రోడ్డుకు, రూ.5.74 కోట్లతో బనిగండ్లపాడు – బంజర బీటీ రోడ్డు నిర్మాణాలు, బోనకల్ మండలంలో రూ. 20 కోట్లతో చేపట్టే కలకోట – మోటమర్రి రోడ్డు విస్తరణ, రూ.8కోట్లతో రావినూతల – ఆళ్లపాడు వరకు రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అంతేకాక కలకోటలో హరిజన మత్య్స సొసైటీ భవనం, అంగన్‌వాడీ భవనాలను ప్రారంభించారు.
ఆదాయం పెరగకున్నా...
ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశాల్లో డిప్యూటీ సీఎం మాట్లాడుతూ రాష్ట్రంలోనే మధిరను మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేలా ప్రణాళికలు సిద్ధమయ్యాయని తెలిపారు. ఇప్పటికే ఇందిరా డెయిరీ ఏర్పాటు పురోగతిలో ఉండగా, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం మొదలైందని చెప్పారు. అలాగే, అన్ని గ్రామాల్లో రహదారుల నిర్మాణం చేపడుతామని తెలిపారు. కాగా, గత ప్రభుత్వంలో కంటే నేడు ఆదాయం పెరగలేదని, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని పేర్కొన్నారు. అయినప్పటికీ వ్యవసాయంతో పాటు విద్య, వైద్య రంగాలకు పెద్దపీట వేస్తూ పథకాలు ప్రవేశపెడుతున్నామని తెలిపారు. ఇప్పటివరకు ప్రతీ గ్రామంలో వెచ్చించిన నిధులు, చేసిన అభివృద్ధి వివరాలను లెక్కలతో సహా వెల్లడిస్తామని పేర్కొన్నారు. కాగా, యువత ఆర్థికాభివృద్ధి సాధించేలా ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం లబ్ధిదారులకు జూన్ 2న మంజూరు పత్రాలను పంపిణీ చేస్తామని భట్టి తెలిపారు. అనంతరం పలువురికి కల్యాణలక్ష్మి చెక్కులు అందచేయగా, లక్ష్మీపురంలోని కాంగ్రెస్ నాయకుడు తల్లపురెడ్డి నాగిరెడ్డి ఏర్పాటు చేసిన గొర్రెల ఫామ్‌ను పరిశీలించి కాంగ్రెస్ శ్రేణులతో సమీక్షించారు. ఈకార్యక్రమాల్లో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్, డీఎంహెచ్‌ఓ కళావతిబాయి, డీసీహెచ్‌ఓ రాజశేఖర్, ఆర్డీఓ నర్సింహారావు, ఎన్పీడీసీఎల్ ఎస్‌ఈ శ్రీనివాసాచారి, పీఆర్ ఈఈ వెంకటరెడ్డి, మధిర మార్కెట్ చైర్మన్ బండారు నర్సింహారావు, ఏడీఈ విజయచంద్ర, తహసీల్దార్ పున్నంచందర్, కాంగ్రెస్ జిల్లా, మండలాల అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, వేమిరెడ్డి సుధాకర్‌రెడ్డి, గాలి దుర్గారావు పాల్గొన్నారు. అలాగే, నాయకులు దొబ్బల సౌజన్య, చావా రామకృష్ణ, శీలం శ్రీనివాసరెడ్డి, బొగ్గుల గోవర్దన్‌రెడ్డి, యరమల పూర్ణచంద్రారెడ్డి, అనుమోలు కృష్ణారావు, వేజండ్ల సాయి, కర్నాటి రామకోటేశ్వరరావు, మోదుగు సుధీర్‌బాబు, పైడిపల్లి కిషోర్‌కుమార్, పిల్లలమర్రి నాగేశ్వరరావు, చేబ్రోలు వెంకటేశ్వర్లు, వట్టికొండ రామకృష్ణ తదితరులు హాజరయ్యారు.
అన్ని రంగాల్లో
అభివృద్ధికి సిద్ధంగా ప్రణాళికలు
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

మోడల్ నియోజకవర్గంగా మధిర