
రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోళ్లు
తల్లాడ: రైతులకు ఎలాంటి ఇబ్బంది ఎదురుకాకుండా ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. తల్లాడ మండలం కుర్నవల్లిలో మంగళవారం ఆయన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించాక ఎంపీడీఓ కార్యాలయంలో మిల్లర్లతో సమావేశమయ్యారు. ఈసందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 351 కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 1.50లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఇందులో హనుమకొండకు జిల్లాకు 20 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం తరలించగా, ఆ జిల్లాకు ఇంకా 30వేల మెట్రిక్ టన్నులతో పాటు వరంగల్‌కు 20 వేల మెట్రిక్ టన్నులు తరలిస్తామని చెప్పారు. అయితే, కొనుగోలు కేంద్రాల్లో కాంటా కాగానే మిల్లులకు తరలించేలా లారీలు సమకూరుస్తున్నందున వేగం పెంచాలని సూచించారు. కాగా, కుర్నవల్లిలో 1638 రకం ధాన్యం 30 వేల బస్తాలు ఉన్నందన మిల్లు యజమానులు దిగుమతి చేసుకోవాలని తెలిపారు. ఎవరైనా తేమ, తాలు పేరుతో తరుగు తీస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. వర్షానికి ధాన్యం తడవకుండా 13 వేల టార్పాలిన్లు సరఫరా చేశామని అదనపు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్‌ఓ చందన్‌కుమార్, డీఎం గంటా శ్రీలత, ఆర్‌డీఓ రాజేందర్ గౌడ్, తహసీల్ధార్ సురేష్‌కుమార్, ఆర్‌ఐలు కిరణ్, మొయినుద్దీన్ పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి