
ఆర్టీసీ అభివృద్ధికి ప్రణాళికలు
ఇల్లెందు/చుంచుపల్లి: ప్రయాణికుల సహకారం, ఉద్యోగులు, సిబ్బంది సమష్టి కృషితో ఆర్టీసీ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని సంస్థ కరీంనగర్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సోలోమన్ తెలిపారు. ఇల్లెందు, కొత్తగూడెం బస్టాండ్లు, డిపోలను సోమవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఈడీ డిపోల్లో బస్సుల నిర్వహణ, సిబ్బంది పనితీరుపై ఆరా తీశాక మాట్లాడారు. ప్రయాణికుల అవసరాలు తీర్చడమే సంస్థ కర్తవ్యమని, అందులో భాగంగా ప్రతీ మారుమూల ప్రాంతానికి బస్సు సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. డిమాండ్ మేరకు కొత్త రూట్లను ఎంపిక చేసి, ఆదాయం పెంచుకోవాలని ఉద్యోగులకు సూచించారు. బస్టాండ్లలో తాగునీరు, పారిశుద్ధ్యం వంటి చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. ఇల్లెందు డిపోలో 25 బస్సులు ఉన్నాయని, నిత్యం 9,500 కిలోమీటర్లు ప్రయాణించడం ద్వారా రూ.5 లక్షల వరకు ఆదాయం సమకూరుతోందని అధికారులు ఆయనకు వివరించారు. కాగా, ఇల్లెందు బస్ స్టేషన్‌లో పెట్రోల్ బంక్ ఏర్పాటుకు షాపులను తొలగించాల్సి వస్తోందని, వ్యాపారులకు ఇచ్చిన గడువు ముగిసినందున మిగిలిన షాపులను తామే కూల్చివేస్తామని ఈడీ ప్రకటించారు. అలాగే, ఇల్లెందు ఆర్టీసీ డిపోలో డీజిల్ బంక్ ఏర్పాటుచేసే వరకు బస్సులకు ఇంధనం సమకూర్చేలా ఏర్పాటుచేసిన మినీ డీజిల్ మినీ ట్యాంక్‌ను ఆయన పరిశీలించి నిర్వహణపై సూచనలు చేశారు. ఈ కార్యక్రమాల్లో ఖమ్మం రీజియన్ మేనేజర్ సరిరామ్, డీఎం దేవేందర్‌గౌడ్, డిప్యూటీ ఆర్‌ఎం మల్లయ్య పాల్గొన్నారు.
కరీంనగర్ జోన్ ఈడీ సోలోమన్