
అర్హులందరికీ సంక్షేమ పథకాలు
ఐటీడీఏ పీఓ రాహుల్
భద్రాచలంటౌన్: అర్హులైన గిరిజనులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా అధికారులు కృషి చేస్తారని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ అన్నారు. భద్రాచలంలోని ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గిరిజన దర్బార్‌లో ఆయన వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా పీఓ మాట్లాడుతూ పోడు, వ్యక్తిగత భూములకు పట్టాలు, రైతుభరోసా, స్వయం ఉపాధి పథకాలకు రుణాలు, దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్స కోసం ఆర్థిక సాయం తదితర అవసరాల కోసం గిరిజనులు దరఖాస్తులు ఇచ్చారని తెలిపారు. వీటి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అధికారులకు సూచించారు. గిరిజన దర్బార్‌లో వచ్చిన అర్జీలన్నీ ఆన్‌లైన్‌లో ప్రత్యేక రిజిస్టర్‌లో నమోదు చేసి, అర్హులకు విడతల వారీగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడానికి చర్యలు చేపడతామని తెలిపారు. ఏపీఓ డేవిడ్ రాజ్, డీడీ మణెమ్మ, ఈఈ చంద్రశేఖర్, వివిధ విభాగాల అధికారులు అరుణకుమారి, రవీంద్రనాథ్, భాస్కరన్, వేణు, లక్ష్మీనారాయణ, ఉదయ్, నరేష్, ఆదినారాయణ, నారాయణరావు, హరికృష్ణ, లింగా నాయక్ తదితరులు పాల్గొన్నారు.