
రైలు నుంచి జారిపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి
ఎర్రుపాలెం: వేగంగా వెళ్తున్న రైలు నుండి జారిపడిన గుర్తు తెలియని వ్యక్తి(45) మృతి చెందాడు. ఖమ్మం జీఆర్పీఎస్‌ఐ బి.రాణాప్రతాప్ తెలిపిన వివరాల ప్రకారం... ఖమ్మం నుండి విజయవాడ వైపు వెళ్తున్న రైలు నుండి సదరు వ్యక్తి జారిపడగా తీవ్రగాయాలత మృతి చెందాడు. ఆయన వద్ద ఖమ్మం – విజయవాడ టికెట్ తప్ప ఇతర ఆధారాలు లభించలేదు. నలుపు, తెలుపు గళ్ల షర్ట్, బ్లాక్ పాయింట్ ధరించిన వ్యక్తి మృతదేహాన్ని మధిర ప్రభుత్వాస్పత్రి మార్చురీలో భద్రపరిచారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 87126 58589, 98481 14202 నంబర్లలో సంప్రదించాలని ఎస్‌ఐ సూచించారు.
రెండు కేజీల గంజాయి స్వాధీనం
● ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
కారేపల్లి: గంజాయితో వెళ్తున్న ఇద్దరిని కారేపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రెండు కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. పోలీసులు వెల్లడించిన వివరాలు... ఇల్లెందుకు చెందిన వలిపెద్ది రాజ్‌కమల్, కొత్తగూడెంలోని చుంచుపల్లికి చెందిన కుంజా దిలీప్ చెరో కేజీ గంజాయి సంచులతో ఖమ్మం వెళ్లేందుకు సోమవారం కారేపల్లి వద్ద వేచి ఉన్నారు. ఈక్రమంలో సింగరేణి సీఐ తిరుపతిరెడ్డి, ఎస్‌ఐ ఎన్.రాజారాం ఆ మార్గంలో వెళ్తుండగా పోలీసులను చూసిన రాజ్‌కమల్, దిలీప్ పరుగు పెట్టారు. దీంతో వెంబడించి పట్టుకోగా, రెండు కేజీల గంజాయి లభించింది. ఇల్లెందుకు చెందిన రాజ్‌కమల్ 2017లో సోలార్ ప్లాంట్ వద్ద జరిగిన ఓ హత్య కేసులో నిందితుడు కాగా, బెయిల్‌పై వచ్చాక కోర్టు వాయిదాలకు హాజరు కాకపోవడంతో అరెస్టు వారెంట్ జారీ చేసింది. ప్రస్తుతం దిలీప్‌తో కలిసి ఆయన గంజాయి తీసుకెళ్తూ పట్టుబడ్డాడు.