
రామయ్యకు ముత్తంగి అలంకరణ
భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారు సోమవారం ముత్తంగి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజామున గర్భగుడిలో సుప్రభాతసేవ, సేవాకాలం, ఆరాధన, తదితర పూజలు చేశారు. అనంతరం స్వామివారి ఉత్సవమూర్తులను బేడా మండపంలో కొలువుదీర్చారు. విశ్వక్సేనపూజ, పుణ్యావాచనం జరిపించాక స్వామి వారికి కంకణఽ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్య కల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
కమనీయం.. నృసింహ కల్యాణం
శ్రీసీతారామచంద్ర స్వామి వారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ యోగానంద లక్ష్మీనృసింహ స్వామి వారి తిరు కల్యాణ వేడుక వైశాఖ పౌర్ణమి సందర్భంగా సోమవారం కమనీయంగా జరిగింది. మొదట విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం జరిపించిన అర్చకులు.. వేద మంత్రాల నడుమ కల్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.