
నేత్రపర్వంగా నృసింహుడి కల్యాణం
ఖమ్మంగాంధీచౌక్: ఖమ్మంలోని స్వయంభూ శ్రీ స్తంభాద్రి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం (గుట్ట)లో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి స్వామి కల్యాణ మహోత్సవం నిర్వహించారు. ఉదయం నుంచే ప్రత్యేక పూజలు మొదలుకాగా, స్వామి మూలవిరాట్‌కు 108 కలశాలతో అభిషేకం చేశారు. ఆతర్వాత స్వామిని అలంకరించి, తలంబ్రాలు కలిపారు. అనంతరం మధ్యాహ్నం సుదర్శన యాగం నిర్వహించారు. సాయంత్రం ముత్యాల తలంబ్రాల ఊరేగింపు, ఎదుర్కోలు ఉత్సవం తర్వాత రాత్రి 7గంటలకు అర్చకులు కల్యాణ క్రతువు జరిపించారు. ఆలయ ఈఓ కొత్తూరు జగన్మోహనరావు, భక్తులు పాల్గొన్నారు.