ఏటీసీ.. అంతా రెడీ! | - | Sakshi
Sakshi News home page

ఏటీసీ.. అంతా రెడీ!

May 12 2025 12:34 AM | Updated on May 12 2025 12:34 AM

ఏటీసీ

ఏటీసీ.. అంతా రెడీ!

త్వరలో అందుబాటులోకి నూతన భవనం
● ఇప్పటికే అడ్వాన్స్‌ కోర్సుల పరికరాలు సిద్ధం ● కొత్తగా ఆరు కోర్సుల్లో బోధనకు అవకాశం

ఖమ్మంసహకారనగర్‌: విద్యార్థులకు మరింత ఉపయుక్తమైన కోర్సులను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసిన కొన్ని ఐటీఐల్లో ఏటీసీ (అడ్వాన్స్‌డ్‌ ట్రైనింగ్‌ కోర్సు)లను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా టేకులపల్లి ఐటీఐలో ఏటీసీ ఏర్పాటుతోపాటు నూతన భవనాన్ని మంజూరు చేసింది. ప్రస్తుతం ఈ భవన నిర్మాణ పనులు తుది దశకు చేరుకోగా.. కొత్తగా ప్రవేశపెడుతున్న కోర్సులకు సంబంధించిన పరికరాలు అమరుస్తున్నారు. 2024 – 25 విద్యా సంవత్సరంలో కళాశాల భవన నిర్మాణానికి రూ.4.77కోట్లు కేటాయించారు. ఇండస్ట్రియల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ (ఐఐసీ)ద్వారా పరికరాలు ఏర్పాటు చేస్తున్నారు.

అడ్వాన్స్‌ కోర్సుల కోసం..

రాష్ట్రంలో మొత్తం 65 ప్రభుత్వ ఐటీఐలు ఉండగా.. వాటిని అడ్వాన్స్‌డ్‌ ట్రైనింగ్‌ సెంటర్లుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. పైలట్‌ ప్రాజెక్టుగా తొలిదశలో హైదరాబాద్‌లోని మల్లేపల్లి ప్రభుత్వ ఐటీఐ, నిజామాబాద్‌ ప్రభుత్వ ఐటీఐ, ఖమ్మం జిల్లాలోని టేకులపల్లి ప్రభుత్వ ఐటీఐలను అప్‌గ్రేడ్‌ చేసింది. ఈ కోర్సులు ప్రవేశపెట్టడంతో విద్యార్థులకు ఉపాధి అవకాశాలు మరింత మెరుగు కానున్నాయి. గతంలో 8 కోర్సులు ఉండగా.. ఏటీసీ ద్వారా కొత్తగా ఆరు కోర్సులు వచ్చాయి. ఈ కోర్సుల ద్వారా విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

కొత్త కోర్సులకు రంగం సిద్ధం..

నూతనంగా ఏర్పాటు చేసిన ఏటీసీలో మాన్యుఫ్యాక్చరింగ్‌ ప్రాసెస్‌ కంట్రోల్‌ ఆటోమేషన్‌, ఇండస్ట్రియల్‌ రోనబోటిక్స్‌ అండ్‌ డిజిటల్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌, ఆర్టిజన్‌ యూజింగ్‌ అడ్వాన్స్‌డ్‌ టూల్స్‌, బేసిక్‌ డిజైనర్‌ అండ్‌ వర్చువల్‌ వెరిఫైయర్‌ (మెకానికల్‌), అడ్వాన్స్‌డ్‌ సీఎస్‌సీ మిషనింగ్‌ టెక్నీషియన్‌, మెకానిక్‌ ఎలక్ట్రిక్‌ వెహికిల్‌ కోర్సులు ప్రవేశపెట్టారు. ఈ కోర్సులను నేర్చుకోవడం ద్వారా విద్యార్థులు స్వయం ఉపాధి పొందే అవకాశాలు ఉంటాయి. ఈ కోర్సులకు సంబంధించిన ప్రాక్టికల్స్‌ కోసం అవసరమైన పరికరాలను భవనంలో అమరుస్తున్నారు. దాదాపు ఏడు మిషనరీలను ఇక్కడ అమర్చారు. వీటి ద్వారా విద్యార్థులకు మరింత నాణ్యమైన బోధన అందనుంది. ఇదిలా ఉండగా ఈ నెలాఖరు వరకు భవనం పనులు పూర్తి చేసి ప్రారంభించనున్నారు.

ఇండస్ట్రియల్‌ ఆటోమేషన్‌ అండ్‌ సిములేటర్‌

మాన్యుఫ్యాక్చరింగ్‌ ప్రాసెస్‌ అండ్‌ ఆటోమేషన్‌లో ఇండస్ట్రియల్‌ ఆటోమేషన్‌, సిములేటర్‌ తీరును వివరిస్తారు. పీఎల్‌సీ ప్రోగ్రామింగ్‌పై అవగాహన కల్పిస్తారు. పవర్‌ప్లాంట్‌ ఆపరేషన్‌ కంట్రోలింగ్‌, క్వాలిటీ, ప్రాసెస్‌ కంట్రోల్‌, న్యూమాటిక్స్‌, హైడ్రాలిక్స్‌, మెషిన్‌ ఆపరేషన్‌ కంట్రోలర్‌పైనా వివరిస్తారు. ఇండస్ట్రియల్‌ రోబోటిక్స్‌లో అడ్వాన్స్‌ వెల్డింగ్‌, టిగ్‌ వెల్డింగ్‌, మిగ్‌ వెల్డింగ్‌, ఏఆర్‌సీ, గ్యాస్‌ వెల్డింగ్‌తో పాటు రోబోలను వాడుకుని వస్తువులను షిఫ్ట్‌ చేయడం వంటివి నేర్పిస్తారు.

మెకానిక్‌ ఎలక్ట్రిక్‌ వెహికిల్‌..

ఎలక్ట్రిక్‌ వెహికిల్‌ మెకానిజమ్‌ నేర్పిస్తారు. బ్యాటరీ నిర్వహణ, ట్రబుల్‌ షూటింగ్‌, వెహికిల్‌ సర్వీసింగ్‌, అసెంబుల్‌ ఎలక్ట్రిక్‌ వెహికిల్‌ కాంపోనెంట్స్‌, ఎలక్ట్రిక్‌ వెహికిల్‌ రిపేరింగ్‌పై శిక్షణ ఇస్తారు.

సీఎన్‌సీ, వీఎంసీ మిషన్‌

మొదటగా సీఎన్‌సీ, వీఎంసీ మిషన్‌ ఏర్పాటు చేశారు. ఈ మిషన్‌పై గౌర్‌ కటింగ్‌, నట్‌, బోల్ట్‌ తయారీ, మెటల్‌ కటింగ్‌, ట్రిమ్మింగ్‌, టర్నింగ్‌, ఫేసింగ్‌, క్రాఫ్ట్‌, హస్తకళలు, శిల్పం, నమూనా, సీఏడీ సాఫ్ట్‌వేర్‌ డిజైనింగ్‌ తదితర వాటిని నేర్పిస్తారు.

ఉద్యోగావకాశాలు సులువు

రాష్ట్ర ప్రభుత్వం ఐటీఐ కళాశాలలను ఏటీసీలుగా అప్‌గ్రేడ్‌ చేయటం ద్వారా ఆరు కొత్త కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కొత్త కోర్సుల ద్వారా నూతన టెక్నాలజీతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సులభంగా లభించనున్నాయి. కోర్సులు, ట్రైనింగ్‌ పూర్తయిన వారికి టాటా గ్రూప్‌ వారే వారి సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. దీని ద్వారా అనేక మంది విద్యార్థులకు ఉపాధి లభిస్తుంది.

– ఎ.శ్రీనివాసరావు, ప్రిన్సిపాల్‌, ఐటీఐ, ఖమ్మం

ఏటీసీ.. అంతా రెడీ!1
1/2

ఏటీసీ.. అంతా రెడీ!

ఏటీసీ.. అంతా రెడీ!2
2/2

ఏటీసీ.. అంతా రెడీ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement