
నేడు మంత్రి పొంగులేటి పర్యటన
తిరుమలాయపాలెం/ఖమ్మంవన్‌టౌన్ : రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లాలో సోమవారం పర్యటించనున్నారు. ఉదయం 10.30 గంటలకు తిరుమలాయపాలెం మండలం కొక్కిరేణిలో సీసీ రోడ్లు, ఆదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ చేస్తారు. 11 గంటలకు ఎర్రగడ్డ, 11.30 గంటలకు మేడిదపల్లిలో సీసీ రోడ్ల నిర్మాణానికి, మధ్యాహ్నం 12 గంటలకు గోపాయిగూడెంలో ఆదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. 1.30 గంటలకు కూసుమంచి క్యాంపు ఆఫీస్ నుంచి ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు నల్లగొండ జిల్లాకు వెళతారు.
రేపు పాలిసెట్
ఖమ్మం సహకారనగర్: పాలిటెక్నిక్ ప్రవేశాల కోసం నిర్వహించే పాలిసెట్ – 2025 ఈనెల 13న జరగనుందని పాలిసెట్ కో ఆర్డినేటర్, ఎస్‌ఆర్‌బీజీఎన్‌ఆర్ కళాశాల ప్రిన్సిపాల్ మహ్మద్ జాకిరుల్లా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకు పరీక్ష ఉంటుందని, ఎస్‌ఆర్‌బీజీఎన్‌ఆర్ కళాశాలలో 800 మంది, ఎస్‌బీఐటీలో 500, కవితా మెమోరియల్ డిగ్రీ కళాశాలలో 500, దరిపల్లి అనంతరాములు ఇంజనీరింగ్ కళాశాలలో 500, డీఆర్‌ఎస్ డిగ్రీ కళాశాలలో 504 మంది విద్యార్థులు హాజరు కానున్నారని వివరించారు. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేశామని వెల్లడించారు. ఎండల తీవ్రత దృష్ట్యా దూర ప్రాంత విద్యార్థులు ఉదయం 9 గంటల వరకు తమకు కేటాయించిన పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. హాల్ టికెట్, ఆధార్ కార్డుతో పాటు, హెచ్‌బీ పెన్సిల్, బ్లూ/బ్లాక్ పెన్ తీసుకురావాలని తెలిపారు.
పెరిగిన ఉష్ణోగ్రతలు
ఖమ్మంవ్యవసాయం: గత వారం ఉపరితల ద్రోణి కారణంగా తగ్గిన ఉష్ణోగ్రతలు క్రమంగా మళ్లీ పెరుగుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచే ఎండ తీవ్రత పెరుగుతూ 11 గంటల వరకు తీవ్రరూపం దాల్చుతోంది. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. మధ్యాహ్నం రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉంటున్నాయి. పలు రంగాల్లో పనిచేస్తున్న వారు ఉదయం 7 గంటలకు ప్రారంభించి మధ్యాహ్నం 12 గంటల వరకే ముగిస్తుండగా కొందరు ఉదయం, సాయింత్రం వేళల్లో పనులు చేస్తున్నారు. జిల్లాలోని అనేక ప్రాంతాల్లో ఆదివారం 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బాణాపురంలో 42.8 డిగ్రీలు, పమ్మిలో 42.7, పెనుబల్లిలో 42.6, కూసుమంచిలో 42.4, చింతకానిలో 42.1, నేలకొండపల్లిలో 42, గౌరారం, వైరా ఏఆర్‌ఎస్‌లో 41.7, తల్లాడ, గేటు కారేపల్లి, తిరుమలాయపాలెం, వైరా, కుర్నవల్లి, లింగాలలో 41.4, కల్లూరు 41.3, ఖమ్మం ప్రకాశ్‌నగర్, ముదిగొండలో 40.9, ఎర్రుపాలెం, పల్లెగూడెంలో 40.8, ఖమ్మం ఖానాపురం, వేంసూరులో 40.6, రఘునాథపాలెంలో 40.5, కాకరవాయి, కొణిజర్లలో 40.2, బచ్చోడులో 40.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా, అత్యల్పంగా సత్తుపల్లిలో 38.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఎండలు, ఉక్కపోతకు తోడు అప్రకటిత విద్యుత్ కోతలతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.
నేత్రపర్వంగా
రామయ్య కల్యాణం
భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి నిత్య కల్యాణ వేడుక ఆదివారం నేత్ర పర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన, తదితర పూజలు చేశారు. అనంతరం స్వామివారిని మేళతాళాల నడుమ గర్భగుడి నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి బేడా మండపంలో కొలువుదీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం అనంతరం కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి కల్యాణాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. నిత్యకల్యాణ వేడుకలోనూ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
కిన్నెరసానిలో
పర్యాటకుల సందడి
పాల్వంచరూరల్: కిన్నెరసానిలో పర్యాటకులు సందడి చేశారు. మండల పరిధిలోని కిన్నెరసానికి ఆదివారం పలు ప్రాంతాల నుంచి సందర్శకులు తరలివచ్చారు. డ్యామ్‌పైనుంచి జలాశయాన్ని, డీర్ పార్కులోని దుప్పులను వీక్షించారు. 406 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించగా వైల్డ్‌లైఫ్ శాఖ రూ.22,885 ఆదాయం లభించింది.

నేడు మంత్రి పొంగులేటి పర్యటన