
వైభవంగా నృసింహ జయంతి
ఖమ్మంగాంధీచౌక్: ఖమ్మంలోని శ్రీ స్తంభాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో వార్షిక పంచాహ్నిక బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో స్వాతి నక్షత్రం సందర్భంగా ఆదివారం స్వామివారి జయంతి వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈఓ కొత్తూరు జగన్మోహన్ రావు పర్యవేక్షణలో తెల్లవారుజామున 5:30 గంటల నుంచే అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సంప్రదాయయుతంగా సుదర్శన యాగం చేశారు.
నయనానందకరంగా గిరి ప్రదక్షిణ..
భక్తజన సందోహం నడుమ ఖమ్మం నడిబొడ్డున ఉన్న స్తంభాద్రి గుట్ట చుట్టూ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఉత్సవ విగ్రహాలతో నిర్వహించిన గిరి ప్రదక్షిణ నయనానందకరంగా సాగింది. పండితుల మంత్రోచ్ఛరణలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాటాల నడుమ స్వామివారిని పల్లకీలో ఊరేగిస్తూ గిరి ప్రదక్షణ చేశారు. అనంతరం గుట్టపై ఆలయం పక్కన నక్షత్ర జ్యోతి(దివ్యజ్యోతి)ని అర్చకులు వెలిగించగా దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఆ సమయాన భక్తుల నృసింహ నామ స్మరణలతో ఆ ప్రాంతం మార్మోగింది.
జయజయధ్వానాల నడుమ
స్వామివారి గిరి ప్రదక్షిణ
నక్షత్ర జ్యోతి దర్శనానికి పోటెత్తిన భక్తులు

వైభవంగా నృసింహ జయంతి