
వృద్ధులపైకి దూసుకెళ్లిన కారు..
సత్తుపల్లిరూరల్: ఇంటి ముందు కూర్చున్న వృద్ధులపైకి ఓ కారు దూసుకెళ్లడంతో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. సత్తుపల్లి మండలం బుగ్గపాడులో ఆదివారం చోటు చేసుకున్న ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. భద్రాచలం నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని చింతలపూడి మండలం లింగగూడెంకు చెందిన నవవధువులు భద్రాద్రి రాములోరిని దర్శించుకుని తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో బుగ్గపాడులో ఇంటి ముందు కూర్చున్న తాటి వీరమ్మ, గడ్డం చిన్నప్ప వృద్ధులను కారు అదుపు తప్పి ఢీ కొట్టింది. ఇరువురికి తీవ్ర గాయాలు కాగా వారిని 108లో సత్తుపల్లికి తరలించారు.
కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్య
మధిర: కుటుంబ కలహాలతో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆదివారం మాటూరు గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన మానుకొండ తిరుపతమ్మ (30) సుమారు పదేళ్ల క్రితం ఎన్టీఆర్ జిల్లా తిరువూరుకు చెందిన స్కూల్ వ్యాన్ డ్రైవర్ శ్రీనివాసరావును కులాంతర వివాహం చేసుకుంది. వారికి ఒక కుమార్తె ఉంది. ఇటీవల భార్యాభర్తల మధ్య తరచూ వివాదాలు జరుగుతున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో వారం రోజుల క్రితం తిరుపతమ్మ పుట్టింటికి వెళ్లగా.. పెద్ద మనుషుల సమక్షంలో ఆదివారం మాట్లాడుకునేందుకు భర్త, ఆయన తరఫు బంధువులు వస్తున్నారే విషయం తెలసుకున్న ఆమె మనస్తాపానికి గురై ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై మధిర రూరల్ ఎస్సై లక్ష్మీభార్గవి కేసు నమోదు చేసి మధిర ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు.
వడదెబ్బతో వ్యక్తి మృతి
కారేపల్లి: కారేపల్లి భారత్‌నగర్ కాలనీకి చెందిన వేమూరి వెంకన్న(53) వడదెబ్బతో మృతి చెందాడు. ఇటీవల అనారోగ్యానికి గురైన ఆయన ఆదివారం ఎండ తీవ్రత తట్టుకోలేక వడదెబ్బతో మృత్యువాత పడ్డాడు. కాగా, మృతుడు సింగరేణి తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్‌ఏగా విధులు నిర్వర్తించాడు. మృతుడికి భార్య, కుమారుడు, కుమారై ఉన్నారు.
రోడ్డు ప్రమాదంలో ఐదు పశువులు..
ముదిగొండ: ఖమ్మం–కోదాడ జాతీయ రహదారిపై ముదిగొండ, వెంకటాపురం గ్రామాల సమీపాన గుర్తు తెలియని వాహనాలు ఢీకొని ఆదివారం నాలుగు గేదెలు, ఒక దూడ మృతి చెందగా.. మరో గేదెకు గాయాలయ్యాయి. ఇవి ముదిగొండ, వెంకటాపురం గ్రామాలకు చెందిన రైతులు వినోద్‌బాబు, ఉపేందర్‌కు చెందిన గేదెలు కాగా గాయపడిన గేదెకు స్థానిక పశువైద్యసిబ్బంది వైద్య చికిత్స నిర్వహించారు.