
● రానున్న రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలు ● దొరల పాలన
అశ్వారావుపేట : రాష్ట్రంలో సంపద సృష్టించి పేదల కు పంచడం అన్యాయమా అని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క ప్రశ్నించారు. అశ్వారావుపేట నియోజకవర్గంలో రూ.40 కోట్లతో నిర్మించనున్న ఆరు విద్యుత్ సబ్‌స్టేషన్ పనులకు శనివారం స్థానిక పామాయిల్ ఫ్యాక్టరీ ఆవరణలో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. ‘దొరల పాలన కోసం దోపిడీదారులు ఏకమవుతున్నారు.. తస్మాత్ జాగ్రత్త..’ అంటూ హెచ్చరించారు. ప్రజల వద్ద డబ్బు లాగి దోపిడీ చేసేందుకు తాము అధికారంలోకి రాలేదని, రానున్న రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తామని వెల్లడించారు. పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్‌ఎస్ ప్రజలను జలగల్లా పీల్చేసిందని, కేసీఆర్ అడ్డగోలుగా సంపాదించిన డబ్బుతో సభలు నిర్వహిస్తూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు. గడిచిన పదేళ్లలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చారా.. అని ప్రశ్నించారు. కాళేశ్వరం పేరుతో రూ.లక్ష కోట్లు గోదావరిలో పోశారని ఆరోపించారు. రూ.7లక్షల కోట్ల అప్పు తమ ప్రభుత్వంపై వేసినా, సంక్షేమ పథకాల అమలులో వెనుకడుగు వేయడం లేదన్నారు. గిరిజనుల వ్యవసాయం కోసం రూ.12,500 కోట్లతో ఇందిర జల వికాస్ పథకం ప్రవేశపెడుతున్నామని, ఈనెల 18న నాగర్‌కర్నూల్ జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభిస్తారని, అదేరోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతుందని తెలిపారు. ఈ పథకంలో గిరిజన రైతులకు సోలార్, డ్రిప్, ఉద్యాన మొక్కలు ఉచితంగా అందించే ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. పేదల కళ్లలో ఆనందం చూడడమే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. దివంగత సీఎం వైఎస్సార్ హయాంలో ప్రతీ తండా, గ్రామానికీ నాణ్యమైన విద్యుత్ అందించామని, ఇప్పుడు మరింత మెరుగైన సరఫరాకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అలాగే, మొదటి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చామని, ఐటీడీఏ పరిఽధిలో కోటాకు మించి ఇస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి, ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి, ఎమెల్యేలు ఆది నారాయణ, తెల్లం వెంకట్రావు, రాందాస్ నాయక్, ఐడీసీ, గిడ్డంగుల సంస్థ చైర్మన్లు మువ్వా విజ య్‌బాబు, రాయల నాగేశ్వరరా వు, భద్రాద్రి కలెక్టర్ జితేష్ వి. పాటిల్, ఎస్పీ రోహిత్‌రాజ్, ఐటీడీఏ పీఓ రాహుల్ పాల్గొన్నారు.