
శ్రీవారికి ప్రత్యేక పూజలు
ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురంలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు జరిగాయి. తెల్లవారుజామున స్వామి మూలవిరాట్‌తో పాటు ఆలయ ఆవరణలోని శ్రీవారి పాదానికి అర్చకులు పంచామృతంతో అభిషేకం జరిపించారు. ఆతర్వాత శ్రీవారు, అలివేలు మంగ, పద్మావతి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి తెలంగాణ, ఏపీ నుంచి వేలాదిగా హాజరైన భక్తుల సమక్షాన నిత్యకల్యాణం నిర్వహించారు. అనంతరం శ్రీవారికి పల్లకీ సేవ జరిగింది. ఈఓ జగన్మోహన్‌రావు, వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల శ్రీరామచంద్రమూర్తి, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, సూపరింటెండెంట్ విజయకుమారి, అర్చకులు రాజీవ్‌శర్మ, మురళీమోహన్‌శర్మ, ఉద్యోగులు పాల్గొన్నారు.
స్తంభాద్రి ఆలయంలో సుదర్శన యాగం
ఖమ్మంగాంధీచౌక్: ఖమ్మంలోని శ్రీ స్తంభాద్రి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం(గుట్ట)లో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం శ్రీ సుదర్శన యాగం నిర్వహించారు. ఉదయం ప్రాత:కాలార్చన, పానకాభిషేకం, విశేష పూజలు, బాలభోగ నివేదన అనంతరం పండితులు ప్రత్యేకంగా రుణ విమోచన యోగంగా సంప్రదాయ పద్ధతుల్లో యాగం ప్రారంభించారు. ఆలయ ఈఓ కొత్తూరు జగన్మోహన్‌రావు పర్యవేక్షణలో పూజలు జరుగుతుండగా, పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కాగా, లక్ష్మీనర్సింహస్వామి జన్మనక్షత్రం సందర్భంగా ఆదివారం సాయంత్రం గిరి ప్రదక్షిణ నిర్వహిస్తున్నట్లు ఈఓ తెలిపారు. కొండపై ఆలయం నుంచి స్వామి వారి ఉత్సవమూర్తులను బయటకు తీసుకొచ్చి, కొండ చుట్టూ మాడవీధుల్లో గిరి ప్రదక్షిణం చేస్తారని, ఆతర్వాత కొండపై అర్చకులు నక్షత్ర జ్యోతిని వెలిగించనున్నారని ఈఓ వెల్లడించారు.

శ్రీవారికి ప్రత్యేక పూజలు