
బామ్మకు వందేళ్ల జన్మదిన వేడుక
చింతకాని: సంపూర్ణ ఆరోగ్యంతో నిండు నూరేళ్లు జీవించాలని పిల్లలను పెద్దలు ఆశీర్వదిస్తుంటారు. కానీ, మారుతున్న వాతావరణం, ఆహార అలవాట్లతో చాలా మందికి అది సాధ్యం కావడంలేదు. అయితే, వందేళ్లు వచ్చినా ఆరోగ్యంగా నాలుగు తరాల కుటుంబీకులతో జీవిస్తున్న ఓ బామ్మ తన శత పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుపుకుంది. చింతకాని మండలం లచ్చగూడెంనకు చెందిన యలమద్ది సీతమ్మ వందో వేడుకలను ఆమె కుటుంబీకులు శనివారం నిర్వహించారు. ఈ వేడుకల్లో ఆమె ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలతో పాటు మనవలు, మనవరాళ్లు పాల్గొన్నారు. కాగా, సీతమ్మ ఇప్పటికీ ఎవరిపై ఆధారపడకుండా సొంతంగా పనులు చేసుకుంటోందని తెలిపారు.
ఎండు గంజాయి పట్టివేత
ఖమ్మంక్రైం: నగరంలోని కొత్త బస్టాండ్ సమీపంలో శనివారం 3.5 కేజీల ఎండు గంజాయిని ఎకై ్సజ్ పోలీసులు పట్టుకున్నారు. శివకుమార్, బబ్లు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దంతెవాడ నుంచి హైదరాబాద్‌కు 3.5 కేజీల గంజాయిని తరలిస్తుండగా.. నగరంలోని కొత్త బస్టాండ్ వద్ద పట్టుకున్నారు. ఇద్దరిని అరెస్ట్ చేసి గంజాయిని, రెండు సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు.
వైరాలో దొంగల హల్‌చల్
వైరా: వైరాలో శుక్రవారం అర్ధరాత్రి దొంగలు హల్‌చల్ సృష్టించారు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. వైరాలోని ఖమ్మం – సత్తుపల్లి జాతీయ రహదారి పక్కన మూడు దుకాణాలు, గాంధీచౌక్‌లోని రెండు సెల్‌ఫోన్ దుకాణాలతో పాటు ఓ బియ్యం దుకాణంలో చోరీకి పాల్పడ్డారు. సెల్‌ఫోన్ దుకాణాల్లో 20 సెల్‌ఫోన్లు, బియ్యం దుకాణంలో రూ.5 వేల నగదు, సాయి ధనలక్ష్మి కిరాణంలో రూ.15 వేల నగదు ఎత్తుకెళ్లగా, మరో దుకాణం షట్టర్ పగలగొట్టారు. ఒకే రోజు ఆరు దుకాణాల్లో చోరీలు జరగడంతో స్థానిక వ్యాపారుల్లో ఆందోళన నెలకొంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఫెన్సింగ్ రాళ్ల ధ్వంసంపై కేసు
చింతకాని: రఘునాథపాలెం మండలం వెంకటాయపాలెం గ్రామానికి చెందిన కుతుంబాక గోపిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ నాగుల్‌మీరా తెలిపారు. ఖమ్మం కవిరాజ్‌నగర్‌కు చెందిన ఉయ్యాల సత్యంకు చింతకాని మండలం వందనం రెవెన్యూలో 5.14 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమి చుట్టూ ఈ నెల 1వ తేదీన రాళ్లతో ఫెన్సింగ్ వేయగా, గోపి ధ్వంసం చేశాడు. ఘటనపై సత్యం శనివారం ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
చీటింగ్ కేసు నమోదు
దమ్మపేట: అధికారుల సంతకాల ఫోర్జరీతో నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి అక్రమంగా భూబదిలీ చేయించుకున్న ఘటనలో ఓ మహిళపై పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. మండలంలోని మందలపల్లికి చెందిన తూముల ఈశ్వరమ్మ అదే గ్రామానికి చెందిన సాయిల వీరవెంకయ్య బతికుండగానే మృతి చెందినట్టుగా నకిలీ మరణ ధ్రువీకరణ పత్రం సృష్టించింది. ఇందుకోసం అధికారుల సంతకాలను ఫోర్జరీ చేయించింది. వీర వెంకయ్య కుటుంబంలో తాను కూడా ఓ కుటుంబ సభ్యురాలిగా మరో నకిలీ ధ్రువీకరణ పత్రం సృష్టించింది. ఈ ఫోర్జరీ పత్రాలను దమ్మపేట తహసీల్దార్ కార్యాలయంలో సమర్పించి వీర వెంకయ్య పేరు మీద ఉన్న రెండు ఎకరాల 21 కుంటల భూమిని వారసత్వం ద్వారా గతేడాది మే 22న తన పేరున పట్టా చేయించుకుంది. బాధిత రైతు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్సై సాయి కిషోర్ రెడ్డి తెలిపారు.

బామ్మకు వందేళ్ల జన్మదిన వేడుక