
అభివృద్ధి మంత్రం
మున్నేరు తీరం..
●రవాణా ఇక్కట్లు తీర్చేలా..
మున్నేటిపై పాత వంతెన శిథిలావస్థకు చేరడంతో అనుబంధంగా రవాణాకు ఇబ్బంది ఎదురుకాకుండా తీగల(కేబుల్) వంతెన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ నిర్మాణానికి గత ప్రభుత్వం రూ.180 కోట్లు కేటాయించింది. ఖమ్మం నుంచి రాకపోకలు సాగించే వాహనదారులకు ట్రాఫిక్ ఇక్కట్లు తీర్చేలా ఈ నిర్మాణం చేపట్టారు. మొత్తం 14 పిల్లర్లతో నిర్మించనున్న ఈ వంతెనలో భాగంగా మున్నేరు మధ్యలో నాలుగు ప్రధాన పిల్లర్ల పనులు చివరి దశకు చేరాయి. రెండేళ్లలో బ్రిడ్జి నిర్మాణం పూర్తిచేయాలనేది లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. తద్వారా ప్రధాన రహదారిపై ట్రాఫిక్ భారం తగ్గడమేకాక జిల్లా వాసులను ఆకట్టుకునేలా కేబుల్ బ్రిడ్జి అందుబాటులోకి వస్తుంది.
ప్రకాష్‌నగర్ వద్ద మరమ్మతులు
ప్రకాష్‌నగర్ వద్ద ఉన్న హై లెవెల్ వంతెన గత ఏడాది వచ్చిన వరదతో దెబ్బతిన్న విషయం విదితమే. దీంతో బ్రిడ్జి మీదుగా రాకపోకలు నిలిపివేసిన అధికారులు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టారు. దాదాపు రూ.కోటి వ్యయంతో చేపట్టిన పనులు పూర్తవడంతో అవసరమైన అప్రోచ్ రోడ్లు కూడా నిర్మించడంతో సాఫీగా రాకపోకలు సాగుతున్నాయి.
పర్యాటక అభివృద్ధికి కార్యాచరణ
తీగల వంతెనతో పాటు రిటైనింగ్‌వాల్ నిర్మాణంతో పూర్తయితే అటు రవాణా ఇక్కట్లు, ఇటు ముంపు సమస్య తీరిపోతుంది. ఆపై మున్నేరు పరిసరాలను పర్యాటకంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. బ్రిడ్జి, రిటైనింగ్ వాల్ వెంట వాకింగ్ ట్రాక్‌ల నిర్మాణం, లైట్ల ఏర్పాటు తదితర పనులకు కార్యాచరణ సిద్ధమైనట్లు సమాచారం. ఇవన్నీ కార్యరూపం దాలిస్తే నగరవాసులకు కొత్త అందాలు అందుబాటులో వస్తాయని చెప్పొచ్చు.
●రిటైనింగ్ వాల్‌తో భద్రత
ఏటా వర్షాకాలంలో వస్తోందంటే మున్నేటి పరీవాహకంలోని ఖమ్మం అర్బన్, రూరల్ మండలాల ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం గడుపుతుంటారు. ఎప్పుడు వరద ముంచెత్తుతుందోనన్న భయం వారిని వెంటాడుతుంటుంది. దీన్ని అరికట్టేలా రెండు వైపులా మొత్తం 17 కి.మీ. మేర రిటైనింగ్ వాల్ నిర్మాణానికి శ్రీకారం చేపట్టారు. రూ.690 కోట్ల వ్యయంతో చేపడుతున్న ఈ నిర్మాణం ప్రభుత్వ భూముల్లో చకచకా సాగుతోంది. ప్రైవేట్ భూములు సేకరించాల్సిన చోట జాప్యం జరిగినా, ఇప్పుడు ఆ సమస్యలు కూడా ఓ కొలిక్కి వచ్చాయని జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు.
పరీవాహకంలో రూ.వందల కోట్లతో పనులు
చకచకా సాగుతున్న తీగల బ్రిడ్జి,
రిటైనింగ్ వాల్ నిర్మాణం
తద్వారా ముంపు, ట్రాఫిక్ సమస్యలకు చెక్
ఆ తర్వాత పర్యాటక సొబగులు కూడా..

అభివృద్ధి మంత్రం