
మార్పు పేరిట అందమైన వల
● నెత్తిపై నీళ్లు చల్లుకోవడం తప్ప కాంగ్రెస్ చేసిందేమీ లేదు ● బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
సత్తుపల్లి/తల్లాడ: సీఎంగా కేసీఆర్ ఉన్నప్పుడు జిల్లాను సస్యశ్యామలం చేసేలా సీతారామ ప్రాజెక్టును నిర్మిస్తే.. కాంగ్రెస్ నేతలు నీరు విడుదల చేసి నెత్తిన చల్లుకున్నారే తప్ప చేసిందేమీ లేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. మార్పు పేరిట ఆ పార్టీ ప్రజలపై అందమైన వల విసిరిందన్నారు. తల్లాడ మండలం మిట్టపల్లిలో శుక్రవారం డీసీఎంఎస్ మాజీ చైర్మన్ రాయల శేషగిరిరావు కాంస్య విగ్రహాన్ని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో కలిసి కేటీఆర్ శుక్రవారం ఆవిష్కరించారు. తొలుత పహల్గాం మృతులు, పాకిస్తాన్‌తో యుద్ధంలో అమరులైన సైనికులకు మౌనం పాటించి నివాళులర్పించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా చేయకపోగా, రైతులకు బోనస్, భరోసా లేదు, రుణమాఫీ అంతంతే అమలుచేస్తున్నారని విమర్శించారు. జిల్లా నుంచి డిప్యూటీ సీఎం, వ్యవసాయశాఖ మంత్రి, నంబర్–2గా చెప్పుకునే మంత్రి ఉన్నా ఒరిగిందేమీ లేదని తెలిపారు.
భద్రాచలంలో ఉపఎన్నిక ఖాయం
బాండ్లు రాసిస్తాం, అఫిడవిట్ ఇస్తాం, కేసీఆర్ కంటే ఎక్కువే చేస్తామని ఎన్నికల వేళ భట్టి విక్రమార్క, చెప్పారని కేటీఆర్ పేర్కొన్నారు. ఎలా చేస్తారని ప్రశ్నిస్తే వారి పార్టీకి 125 ఏళ్ల చరిత్ర ఉన్నందున సంపద సృష్టిస్తాం, వంద రోజుల్లో హామీలు అమలుచేస్తామన్న మాటలు ఏమయ్యాయని నిలదీశారు. ఇక రేవంత్‌రెడ్డి రైతుబంధు మూడు పంటలకు ఇవ్వాలని చెప్పి ఇప్పుడు ఒక పంటకు కూడా ఇచ్చే పరిస్థితి లేదన్నారు. భద్రాచలం అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక ఖాయమని, ఉమ్మడి జిల్లా బీఆర్‌ఎస్ శ్రేణులంతా అక్కడకు వెళ్లి పార్టీ అభ్యర్థిని గెలిపించేందుకు సిద్ధంగా ఉండాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. అలాగే, స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అత్యధిక స్థానాలు గెలిచేలా ఇప్పటి నుంచే కార్యాచరణ రూపొందించుకోవాలన్నారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యే సండ్ర మాట్లాడుతూ డీసీఎంఎస్ చైర్మన్ పదవి నుంచి రాయల శేషగిరిరావును అవమానకర రీతిలో దించేశారన్నారు. ఆయన అనునిత్యం రైతుల సమస్యలపై ఉద్యమించారని, ధాన్యం కొనుగోళ్లల్లో జాప్యమైతే అప్పటి మంత్రుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేవారని గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాయలను ఇబ్బంది పెట్టినా, నమ్మిన సిద్ధాంతాన్ని చివరి వరకు వీడలేదని తెలిపారు. తొలుత తల్లాడ మండలం రేజర్ల నుంచి మిట్టపల్లి వరకు ర్యాలీ నిర్వహించారు. బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్యేలు కందాల ఉపేందర్‌రెడ్డి, రేగా కాంతారావు, బానోతు మదన్‌లాల్, వనమా వెంకటేశ్వరరావు, మెచ్చా నాగేశ్వరరావు, బానోతు హరిప్రియ, తాటి వెంకటేశ్వర్లు, కొండబాల కోటేశ్వరరావుతో పాటు లింగాల కమల్‌రాజు, కూరాకుల నాగభూషణం, దిండిగాల రాజేందర్, దొడ్డా శ్రీనివాసరావు, రెడ్డెం వీరమోహన్‌రెడ్డి, డి.వెంకటలాల్, దిరిశాల దాసురావు తదితరులు పాల్గొన్నారు.

మార్పు పేరిట అందమైన వల