
కదం తొక్కిన జర్నలిస్టులు
ఖమ్మంమయూరిసెంటర్: ‘సాక్షి’ ఎడిటర్ ధనుంజయరెడ్డి ఇంట్లో ఏపీ ప్రభుత్వం పోలీసులతో దాడి చేయించడాన్ని జర్నలిస్టు సంఘాల నాయకులు ముక్తకంఠంతో ఖండించారు. ఎలాంటి నోటీసులు లేకుండానే విజయవాడలోని ఎడిటర్ ఇంట్లోకి ప్రవేశించడం ద్వారా ఏపీ ప్రభుత్వం జర్నలిస్టులను భయభ్రాంతులకు గురిచేయాలని చూస్తోందని ఆరోపించారు. ఈమేరకు శుక్రవారం జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యాన ఖమ్మంలో జెడ్పీ కార్యాలయం నుంచి డాక్టర్ బీఆర్.అంబేద్కర్ విగ్రహం వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు.
జర్నలిజంపై ముప్పేట దాడి
టీయూడబ్ల్యూజే(టీజేఎఫ్) జిల్లా అధ్యక్షుడు ఆకుతోట ఆదినారాయణ మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి మూల స్తంభమైన జర్నలిస్టు వ్యవస్థపై తెలుగు రాష్ట్రాల్లో దాడి జరుగుతోందన్నారు. పాలకులు వారికి అనుకూలంగా మాత్రమే వార్తలు రాయాలని కోరుకుంటుండడంతో ఈ పరిస్థితి ఎదురవుతోందని తెలిపారు. సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డి ఇంట్లోకి పోలీసులు అక్రమంగా జొరబడడం గర్హనీయమన్నారు. టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా ప్రధాన కార్యదర్శి ఏనుగు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మీడియా స్వేచ్ఛను ప్రభుత్వాలు హరిస్తున్నాయన్నారు. ఇటీవల కాలంలో జర్నలిస్టులపై దాడులు పెరగడమే ఇందుకు నిదర్శనమని తెలిపారు. సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డి ఇంటిపై జరిగిన దాడికి ఏపీ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ విజయవాడలోని సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డి ఇంటిపై ఏపీ పోలీసులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పాలకులు ప్రజామన్ననలు చూరగొనేలా పాలించాలే తప్ప వారికి వ్యతిరేక వార్తలు రాశారని జర్నలిస్టులను భయభ్రాంతులకు గురిచేయడం అత్యంత హేయనీయమని తెలిపారు. పత్రికా, వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగేలా ఇలాంటి దాడులు చేయడాన్ని తమ యూనియన్ ఖండిస్తోందన్నారు. టీయూడబ్ల్యూజే(టీజేఎఫ్) జిల్లా ప్రధాన కార్యదర్శి చిర్రా రవి, బాధ్యులు గుద్దేటి రమేష్, కొరకొప్పుల రాంబాబు, యలమంద జగదీష్, టీఎస్ చక్రవర్తి, టీయూడబ్ల్యూజే(ఐజేయూ) నగర అధ్యక్ష, కార్యదర్శులు మైసా పాపారావు, చెరుకుపల్లి శ్రీనివాస్, బాధ్యులు మొయినుద్దీన్, శివానంద, టీడబ్ల్యూజేఎఫ్ నాయకులు సయ్యద్ ఖదీర్, దువ్వా సాగర్, ఆవుల శ్రీనివాస్, కూరాకుల గోపి, వేగినాటి మాధవరావు, మహిళా ప్రతినిధులు మధుశ్రీ, వంగూరి ఈశ్వరి, జర్నలిస్టులు మారెడ్డి నాగేందర్‌రెడ్డి, పి.సత్యనారాయణ, ‘సాక్షి’ బ్రాంచ్ మేనేజర్ మోహన్‌కృష్ణ, టీవీ ప్రతినిధి పి.మహేందర్‌కుమార్, ఏసీఎం శ్రీనివాస్, ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ నిరసనకు ఏఐఎస్‌ఎఫ్, పీడీఎస్‌యూ జిల్లా ప్రధాన కార్యదర్శులు ఇటికాల రామకృష్ణ, వంగూరి వెంకటేష్ తదితరులు సంఘీభావం తెలిపారు.
‘సాక్షి’ ఎడిటర్ ధనుంజయరెడ్డి
ఇంట్లో సోదాలపై నిరసన
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం,
అక్కడి పోలీసుల తీరుపై ఆగ్రహం

కదం తొక్కిన జర్నలిస్టులు