
మీ భూమిలో సారం ఎంత?
● మట్టి నమూనాలతో భూసార పరీక్షలు ● తగిన జాగ్రత్తలతో కచ్చితమైన ఫలితాలు ● రైతులకు వైరా కేవీకే కోర్డినేటర్, శాస్త్రవేత్తల సలహాలు
వైరా: నేలల్లో సహజంంగా ఉండే పోషక పదార్థాలకు తోడు రైతులు అదనంగా వేసే సేంద్రియ, రసాయన ఎరువులు పంట దిగుబడి పెరిగేందుకు దోహదం చేస్తాయి. అయితే, ఏ నేలలో ఎంత మోతాదులో సారం ఉంది, అక్కడ ఏయే పంటలు సాగు చేయొచ్చు, సాగు సమయాన ఏ మేర ఎరువులు ఉపయోగించాలో తెలియాలంటే మట్టి నమూనాల పరీక్షలు చేయించడం తప్పనిసరి. ఈ పరీక్షల ద్వారా వచ్చే ఫలితాల ఆధారంగా సరిపడా మాత్రమే ఎరువులు వాడితే రైతులకు భారం తగ్గడమే కాక నేల తల్లిని కాపాడుకున్నట్లవుతుంది. ఈనేపథ్యాన మట్టి పరీక్షల కోసం నమూనాల సేకరణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇతర అంశాలపై వైరా కృషి విజ్ఞాన కేంద్రం కోర్డినేటర్ కె.రవికుమార్, శాస్త్రవేత్తలు ఫణిశ్రీ, చైతన్య రైతులకు ఇచ్చిన సూచనలు ఇలా ఉన్నాయి.
ప్రయోజనాలు
పొలంలో ముఖ్య పోషక పదార్థాలైన నత్రజని, భాస్వరం, పోటాష్ ఏ మోతాదులో ఉన్నాయో పరీక్షల ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే, సూక్ష్మపోషక పదార్థాలైన జింక్, మెగ్నిషియం వంటివి ఏ మోతాదులో ఉన్నాయో తెలుసుకుని లోపాలు ఉంటే సరిదిద్దడానికి అవకాశం ఏర్పడుతుంది. సాగుకు అనువుగా లేని ఆమ్లా భూములు, చౌడు భూములను గుర్తించవచ్చు. పరీక్ష ఫలితాల ఆధారంగా ఎరువులను సరిపడా మోతాదులో వాడడం వల్ల రైతులకు వ్యయం తగ్గుతుంది.
మెళకువలు తప్పనిసరి
మట్టి ఆరబెట్టడానికి రసాయన, సేంద్రియ ఎరువుల సంచులను వాడొద్దు. చెట్ల కింద ఉన్న పొలం భాగం నుంచి మట్టి తీయొద్దు. ఎరువు కుప్పలు వేసిన చోట, ఎప్పుడు నీరు నిలిచే పల్లపు ప్రాంతంలోని మట్టి కూడా పనికిరాదు. పొలంలో అక్కడక్కడ చౌడు ఉన్నట్లు అనుమానిస్తే ఆ ప్రాంతంలో ప్రత్యేకంగా నమునాలు సేకరించాలి. తీసి వేరుగా చౌడు లక్షణాల పరీక్ష కోసం పంపాలి.