
మా లక్ష్యం.. ఒకే ఎన్నిక
ఖమ్మం మామిళ్లగూడెం: దేశమంతటా ఒకేసారి ఎన్నికలు జరగాలనేదే తమ పార్టీ విధానమని మెదక్ పార్లమెంటు సభ్యుడు మాధవనేని రఘునందన్‌రావు తెలిపారు. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే వ్యయం తగ్గుతుందని, ఆ నిధులతో సంక్షేమ పథకాల అమలుకు అవకాశముంటుందని చెప్పారు. ఖమ్మంలో శుక్రవారం ‘వన్ నేషన్ – వన్ ఎలక్షన్’ అంశంపై బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు అధ్యక్షతన ఏర్పాటుచేసిన సదస్సులో రఘునందన్‌రావు ముఖ్యఅతిథిగా మాట్లాడారు. అంతటా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనే ప్రతిపాదనపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల్లో నిజం లేదన్నారు. వామపక్షాలకు ప్రజలు ఇప్పటికే మంగళం పాడారని, అందుకే తెలంగాణలో ఒక సీటుకు పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. ఇక సరైన మార్గంలో బీజేపీ మాత్రమే పయనిస్తున్నందున, రాబోయే రోజుల్లో తెలంగాణలో తమ పార్టీ జెండా ఎగరడం ఖాయమని తెలిపారు. కాగా, పాకిస్తాన్‌పై పోరులో భారత ప్రభుత్వానికి మద్ధతు ఇస్తున్నట్లు చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి.. రాష్ట్రంలోని మదర్సాల్లో తలదాచుకున్న పాక్ మద్దతుదారులు, పాకిస్తాన్, బంగ్లాదేశ్ వలసవాదులను రాష్ట్ర పొలిమేరలు దాటించాలని సూచించారు. ఇద్దరు మహిళా అధికారుల నేతృత్వాన ఆపరేషన్ సిందూర్‌ను ద్వారా తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను నిర్మూలించడం ద్వారా భారత సైన్యం సత్తా అందరికీ తెలిసిపోయిందని రఘునందన్‌రావు పేర్కొన్నారు. ఈసమావేశంలో నాయకులు దేవకి వాసుదేవరావు, సన్నే ఉదయ్‌ప్రతాప్, దొంగల సత్యనారాయణ, డాక్టర్ శీలం పాపారావు, డాక్టర్ గోంగూర వెంకటేశ్వరావు, మేకల నాగేందర్, ఆర్‌వీఎస్.యాదవ్, పుల్లారావు యాదవ్, తక్కెళ్లపల్లి నరేందర్‌రావు, నున్న రవికుమార్, పెరుమాళ్లపల్లి విజయరాజు, మందా సరస్వతి తదితరులు పాల్గొన్నారు.
వారిని పొలిమేరలు దాటిస్తేనే
సీఎం మాటలపై నమ్మకం
మెదక్ ఎంపీ రఘునందనరావు