
కరువు తీర్చిన ‘రామదాసు’
● మండు వేసవిలోనూ చెరువుల జలకళ ● పాలేరు జలాలతో తాగు, సాగునీటి కష్టాలకు చెక్
తిరుమలాయపాలెం: వేసవి వచ్చిందంటే తాగునీటితో పాటు వర్షాలు కురిసే వరకు సాగునీటికి జిల్లాలోని తిరుమలాయపాలెం మండల ప్రజలు, రైతులు కష్టాలు ఎదుర్కొనేవారు. కానీ ఈసారి ఆ పరిస్థితిలో మార్పు వచ్చింది. మండలంలోని పలు గ్రామాల్లో చెరువులు, కుంటలు, బావులు మండు వేసవిలోనూ నిండా నీటితో కళకళలాడుతున్నాయి. భక్తరామదాసు ఎత్తిపోతల పథకం ద్వారా పాలేరు రిజర్వాయర్ నుంచి అధికారులు ముందస్తుగా మండలంలోని అన్ని చెరువులకు నీరు నింపడంతో కష్టాలు తీరినట్లయింది.
ఐదు దఫాలుగా విడుదల
మండలంలో యాసంగి పంటలు సాగు చేసే రైతులు సాగునీటికి ఇబ్బండి పడకుండా రాష్ట్ర మత్రిపొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశాలతో అధికారులు ఐదుసార్లు భక్తరామదాసు ప్రాజెక్టు ద్వారా పాలేరు నీరు విడుదలచేశారు.దీంతో చెరువులు నిండగా.. సాగు పనులు పూర్తయ్యాక మే నెలలోనూ కళకళలాడుతున్నాయి. మండలంలోని బచ్చోడు, సుబ్లేడు,ఎదుళ్లచెరువు, పిండిప్రోలు, కొక్కిరేణిబీరోలు, పాతర్లపాడు తదితర గ్రామాల చెరువులు నిండుకుండల్లా మారాయి. దీంతో వేసవిలోతాగునీటికి, వచ్చే ఖరీఫ్‌లో సాగునీటి కష్టాలుతీరినట్లేనని ప్రజలు, రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదికాక చెరువుల్లో నీరు సమృద్ధిగా ఉడడంతో చేపల పెంపకానికి కూడా ఇబ్బందులుఉండవని మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రానున్న ఖరీఫ్ సీజన్‌లో వర్షాలువచ్చేవరకు సాఫీగా పంటలు సాగు చేసుకోవచ్చనిఅన్నదాతలు చెబుతున్నారు.
అందరికీ ఉపయోగమే....
భక్తరామదాసు ప్రాజెక్టు ద్వారా మండలంలోని అన్ని చెరువులను నింపారు. దీంతో ఎండాకాలంలోనూ చెరువులు, కుంటలు కళకళలాడుతున్నాయి. సాగు, తాగునీటికి ఇబ్బందులు తీరినట్లే. అలాగే, బావులు, బోర్లలో కూడా నీటిమట్టం పెరిగింది. అంతేకాక చేపల పెంపకానికి సమస్యలు ఉండవు.
–పి.వెంకటనర్సయ్య, మత్స్యకారుడు,
ఎదుళ్లచెరువు

కరువు తీర్చిన ‘రామదాసు’