
మా ధాన్యం ఎప్పుడు కాంటా వేస్తారు?
తల్లాడ: తల్లాడ మండలం కుర్నవల్లి పరిసర గ్రామాల్లోని నెల రోజులుగా కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని ఆరోపిస్తూ రైతులు బుధవారం ఆందోళనకు దిగారు. కుర్నవల్లిలోని కేంద్రానికి 120 లారీల మేర ధాన్యం తీసుకురాగా.. కాంటాలో జాప్యంతో ఇంకా 80 లారీల ధాన్యం మిగిలిపోయింది. ఇంతలోనే అకాల వర్షాలతో రైతులు పంటను కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నా.. గన్నీ సంచులు, లారీలు లేవని అధికారులు తాత్సారం చేస్తున్నారు. దీంతో రైతులు బుధవారం మధ్యాహ్నం మండుటెండలో తల్లాడ చేరుకుని ప్రధాన రహదారిపై ట్రాక్టర్లు అడ్డుగా పెట్టి రాస్తారోకోకు దిగారు. ఈమేరకు అటు కల్లూరు, ఇటు వైరా రోడ్లలో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా ట్రెయినీ ఎస్‌ఐ వెంకటేశ్, సిబ్బంది చేరుకుని వారికి నచ్చచెప్పినా తహసీల్దార్ వచ్చి ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పే వరకు ఆందోళన విరమించే ప్రసక్తి లేదని తేల్చిచెప్పారు. ఈక్రమాన బలవంతంగా రైతులను లేపే ప్రయత్నం చేయగా ఇరువర్గాల వాగ్వాదంతో ఉద్రిక్తత నెలకొంది. ఇంతలోనే తహసీల్ధార్ సురేష్‌కుమార్ చేరుకుని పౌర సరఫరాల సంస్థ డీఎం శ్రీలత, ఆర్డీఓ రాజేందర్‌గౌడ్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఒకటి, రెండు రోజుల్లో 40లారీలు, సరిపడా గన్నీ సంచులు పంపిస్తామని చెప్పడంతో రైతులు ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు, రైతులు శీలం సత్యనారాయణరెడ్డి, కళ్యాణపు కృష్ణయ్య, కట్టా దర్గయ్య, షేక్ మస్తాన్, చల్లా నాగేశ్వర్‌రావు, ఎస్.వీ.రాఘవులు, కట్టా కృష్ణారావు, చలపతిరెడ్డి, మాధవరావు, లక్ష్మారెడ్డి, బద్దం నాగిరెడ్డి, అయిలూరి సత్యనారాయణరెడ్డి, వరకిషోర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తల్లాడలో రైతుల రాస్తారోకో