
మిర్చి ధర పతనం
● రూ.10 వేలకు పడిపోయిన మోడల్ ధర ● గరిష్ట ధర రూ.13 వేలు దాటుతున్నా కొందరికే.. ● నాణ్యత పేరిట తగ్గిస్తున్న వ్యాపారులు
ఖమ్మంవ్యవసాయం: మిర్చి ధర రోజురోజుకూ మరింతగా పతనమవుతోంది. ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో గత వారం వరకు మిర్చి జెండాపాట ధర రూ.13,500 పలకగా, కొద్ది రోజులుగా రూ.13 వేల నుంచి రూ.12,850 మధ్య కొనసాగుతోంది. ఇక రూ.12 వేల వరకు పలికిన మోడల్ ధర కొద్ది రోజులుగా రూ.10 వేలు దాటడం లేదు. మార్కెట్‌లో వ్యాపారులు అధికంగా మోడల్ ధరతోనే కొనుగోలు చేస్తారు. కనిష్ట ధరలు మరింత దయనీయంగా ఉన్నాయి. ఇది రూ.5,800కు మించి దాటకపోవడం గమనార్హం.
గత ఏడాదితో పోలిస్తే దయనీయం
మిర్చి ధర గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది బాగా తగ్గింది. గత ఏడాది సీజన్‌లో క్వింటా మిర్చి రూ.20 వేల వరకు పలకగా.. ఈ ఏడాది సీజన్ ఆరంభం నుంచే ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి. తొలినాళ్లలో రూ.15,500 వరకు ధర పలకగా, క్రమక్రమంగా పతనమవుతోంది. మార్చి నుంచి మరింత పతనం దిశగా కొనసాగుతోంది. ఖమ్మం మార్కెట్‌లో తేజా రకం మిర్చి కొనుగోళ్లకు పేరు ఉండగా.. ఇక్కడి వ్యాపారులు చైనా, తదితర దేశాలకు ఎగుమతి చేస్తారు. ప్రస్తుతం మార్కెట్‌కు 40 నుంచి 50 వేల బస్తాల మిర్చి వస్తోంది.
మోడల్ ధరకే అధిక కొనుగోళ్లు
మార్కెట్‌లో జెండా పాట విధానం ద్వారా మిర్చికి ధర ఖరారు చేస్తారు. పంటకు డిమాండ్, నాణ్యతా ప్రమా ణాల పేరిట వ్యాపారులు మోడల్ ధరతోనే అధికంగా కొనుగోలు చేస్తున్నారు. జెండాపాట ధర తో పోలిస్తే దాదాపు రూ.3వేలు తగ్గిస్తుండగా.. రూ. 10 వేలు అంతకన్నా తక్కువ ధరతోనే కొనుగోలు చేస్తుండడంతో రైతులకు నష్టం ఎదురవుతోంది.
చైనా నుంచి డిమాండ్ లేకనే..
తేజా రకం మిర్చి ధర చైనాలో ఉన్న డిమాండ్‌పై ఆధారపడి ఉంటుంది. ఆ దేశం నుంచి ఆర్డర్ల ఆధారంగా ఎగుమతిదారులు ఇక్కడ ధర నిర్ణయిస్తారు. కానీ, ఈ ఏడాది చైనా నుంచి ఆశించిన స్థాయిలో ఆర్డర్లు లేక తేజామిర్చికి డిమాండ్ పడిపోయింది. అంతేకాక ఇప్పు డు చివరి కోతలు కావడంతో నాణ్యత లేకపోవడం ఇంకో కారణంగా చెబుతున్నారు. కానీ, దీన్ని సాకుగా చూపుతూ పంట నాణ్యతగా ఉన్నా వ్యాపా రులు ధరలో మరింతగా కోత పెడుతున్నారు. ఈ మేరకు ధర గిట్టుబాటు కాకపోవడంతో పలువురు రైతులు నాణ్యమైన పంటను కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేస్తున్నారు.
ఈ ఏడాది సీజన్‌లో ఖమ్మం మార్కెట్‌లో మిర్చి ధరలు
తేదీ గరిష్ట ధర మోడల్ ధర
(రూ.ల్లో) (రూ.ల్లో)
నవంబర్ 6 18,000 17,500
డిసెంబర్ 9 16,500 16,000
జనవరి 17 15,500 15,000
ఫిబ్రవరి 2 14,200 13,700
మార్చి 18 13,700 12,000
ఏప్రిల్ 2 13,300 12,000
ఏప్రిల్ 15 13,500 11,000
ఏప్రిల్ 29 13,400 10,500
ఏప్రిల్ 30 12,850 10,000
మే 7 13,350 10,000