
తలసేమియా పిల్లలకు అండగా ఉంటాం..
ఖమ్మంవైద్యంవిభాగం: తలసేమియాతో బాధపడుతున్న పిల్లలకు తల్లిదండ్రులతోపాటు ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు అండగా నిలుస్తున్నందున తల్లిదండ్రులు ఆవేదన చెందొద్దని డీఎంహెచ్‌ఓ కళావతిబాయి సూచించారు. సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యాన ప్రపంచ తలసేమియా దినోత్సవాన్ని ఖమ్మంలోని ఐఎంఏ హాల్‌లో బుధవారం నిర్వహించారు. సమావేశంలో డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ.. జిల్లాలో తలసేమియా బాధిత చిన్నారుల గుర్తింపునకు సర్వే జరుగుతోందని, పాజిటివ్‌గా తేలిన వారికి చికిత్స అందిస్తామని తెలిపారు. అయితే, తలసేమియా నిర్మూలన, పిల్లల కోసం రక్తదానం చేసేందుకు అందరూ ముందుకు రావాలని సూచించారు. ఏఆర్ ఏసీపీ ఎన్.నర్సయ్య మాట్లాడుతూ.. తలసేమియా చిన్నారులకు సేవ చేయడం ఆనందంగా ఉందన్నారు. ఒలీవ్ క్రిప్టో సిస్టమ్స్ సీఈఓ జి.భారవి మాట్లాడుతూ.. తలసేమియా చిన్నారులకు అండగా నిలిచేలా సంకల్ప సంస్థ కార్యక్రమాల్లో భాగస్వామ్యమవుతానని తెలిపారు. ఈ మేరకు జేఈఈ మెయిన్స్ ఎస్టీ కేటగిరీలో ఆల్ ఇండియా 21వ ర్యాంక్ సాధించిన తలసేమియా చిన్నారి అర్జున్, పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులను సత్కరించారు. సంస్థ బాధ్యురాలు ప్రొద్దుటూరి అనిత అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో తలసేమియా ప్రోగ్రాం ఆఫీసర్ వెంటరమణ, వైద్యులు డి.నారాయణమూర్తి, జంగాల సునీల్‌కుమార్, కొల్లి అనుదీప్, సాయిభార్గవ్, జాబిశెట్టి రేణుక, లక్ష్మీదీపతో పాటుపోలా శ్రీనివాస్, శాంతి, పులిపాటి ప్రసాద్, పావని, కస్తూరి, పి.రవిచంద్ర, పి.ఉదయ్‌భాస్కర్, పి.వంశీకిరిటి, పి.ప్రియ, ఎన్.ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.
డీఎంహెచ్‌ఓ కళావతిబాయి,
ఏసీపీ నర్సయ్య