రోడ్డుప్రమాదంలో యువకుడు మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డుప్రమాదంలో యువకుడు మృతి

May 7 2025 12:13 AM | Updated on May 7 2025 12:13 AM

రోడ్డుప్రమాదంలో యువకుడు మృతి

రోడ్డుప్రమాదంలో యువకుడు మృతి

తల్లాడ: మండలంలోని రెడ్డిగూడెం స్టేజీ వద్ద మంగళవారం ఆటోను ఎదురుగా వచ్చినలారీ ఢీకొట్టిన ఘటనలో ఓ యువకుడు మృతి చెందాడు. ఖమ్మం ఇందిరమ్మ కాలనీకీ చెందిన ఆళ్లకుంట నవీన్‌(20) ఆటోలో తల్లాడ మండలం గాంధీనగర్‌ తండాకు వచ్చి మామిడికాయలు కొన్నాక తిరిగి ఆటోలో బయలుదేరాడు. ఈక్రమాన రెడ్డిగూడెం స్టేజీ వద్ద ఖమ్మం నుంచి ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టడంతో ఆటోలో ఉన్న నవీన్‌ లారీ టైరు కింద పడగా తీవ్ర గాయాల పాలై అక్కడికక్కడే మృతి చెందాడు. అలాగే, ఆటోలో ఉన్న నవీన్‌ చెల్లెలు ఆళ్లకుటం అజితకు గాయాలయ్యాయి. ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ బి.కొండల్‌రావు తెలిపారు.

అడవి గేదెల దాడిలో ఇద్దరికి గాయాలు

సత్తుపల్లిరూరల్‌: రహదారిపై వెళ్తున్న ఆటోకు అడ్డుగా వచ్చిన అడవి గేదెలు దాడి చేయటంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం పెనగడప నుంచి పలువురు కూలీలు మంగళవారం సత్తుపల్లికి బయలుదేరారు. ఈ ఆటో యాతాలకుంట వద్ద రోడ్డు దాటుతుండగా, పక్క నుంచి అడవి గేదెలు దూసుకొచ్చి ఢీకొన్నాయి. దీంతో ఆటోలో ఉన్న పల్లపు రాజు, బోసు ఓదేలుకు గేదెల కొమ్ములు తాకడంతో తీవ్ర గాయాలు కాగా సత్తుపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

ఎలుగుబంటి దాడిలో వ్యక్తి మృతి

ఏన్కూరు: పశువులను మేతకు తీసుకెళ్లిన వ్యక్తిపై ఎలుగుబండి దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు... ఏన్కూరు మండలం కొత్త మేడేపల్లికి చెందిన మడకం సోమార్‌(40) సోమవారం ఉదయం పశువులు, మేకలను తీసుకుని తన ఇద్దరు కుమార్తెలతో సహా సమీప అటవీ ప్రాంతంలోకి వెళ్లాడు. అక్కడ ఆయనపై ఎలుగుబంటి దాడి చేసినట్లు తెలుస్తుండగా, ఆయన కుమార్తెలు మధ్యాహ్నం 3గంటలకు గ్రామానికి వచ్చి తల్లికి చెప్పారు. దీంతో గ్రామస్తులతో కలిసి ఘటనాస్థలికి వెళ్లి సోమార్‌ను కొత్తగూడెం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందాడు. ఘటనపై ఆయన భార్య కుమారి ఫిర్యాదుతో మంగళవారం కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రఫీ తెలిపారు.

లారీ డ్రైవర్‌కు మూడేళ్ల జైలుశిక్ష

సత్తుపల్లి టౌన్‌: మద్యం సేవించి లారీ నడిపి తండ్రీకుమారుల మృతికి కారణమైన డ్రైవర్‌కు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ సత్తుపల్లి సీనియర్‌ సివిల్‌ జడ్జి షేక్‌ మీరా ఖాసీం సాహెబ్‌ మంగళవారం తీర్పు వెలువరించారు. గత ఏడాది జూన్‌ 3వ తేదీన కిష్టారం గ్రామానికి చెందిన పిల్లి పేరయ్య(55), ఆయన కుమారుడు అశోక్‌కుమార్‌(35) సత్తుపల్లి నుంచి కిష్టారం వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. ఇదే సమయాన హైదరాబాద్‌ నుంచి వైజాగ్‌కు వెళ్తున్న లారీ వీరిని ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై సీఐ టి.కిరణ్‌ కేసు నమోదు చేసి ఒడిశాకు చెందిన లారీ డ్రైవర్‌ హర్షిత్‌ రాయ్‌పై చార్జీషీట్‌ దాఖలు చేశారు. విచారణలో ఆయనపై నేరం రుజువు కావడంతో జైలుశిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. ప్రాసిక్యూషన్‌ తరపున పీపీ అబ్దుల్‌ బాషా వాదించగా పోలీసు కానిస్టేబుల్‌ శ్రావణ్‌రెడ్డి, హోంగార్డు ప్రవీణ్‌ సహకరించారు.

చెల్లని చెక్కు కేసులో ఆరు నెలల జైలుశిక్ష

ఖమ్మం లీగల్‌: అప్పు చెల్లించే క్రమాన ఇచ్చిన చెక్కు చెల్లకపోవడంతో నిందితుడికి ఆరు నెలల జైలుశిక్ష విధిస్తూ ఖమ్మం రెండో అదనపు ప్రథమ శ్రేణి కోర్టు న్యాయాధికారి ఏపూరి బిందుప్రియ మంగళవారం తీర్పు చెప్పారు. ఖమ్మం శ్రీనగర్‌ కాలనీకి చెందిన ఎస్‌.రామయ్య వద్ద బైపాస్‌ రోడ్డుకు చెందిన డి.శ్రీనివాసరావు 2017 మే నెలలో రూ.5లక్షల అప్పు తీసుకున్నాడు. ఈ అప్పు చెల్లించే క్రమాన 2019 జూన్‌లో రూ.7.50లక్షలకు చెక్కు జారీ చేశాడు. అయితే, శ్రీనివాసరావు ఖాతాలో సరిపడా నగదు లేక చెక్కు తిరస్కరణకు గురైంది. దీంతో రామయ్య తన న్యాయవాది ద్వారా లీగల్‌ నోటీస్‌ జారీ చేసి కోర్టులో ప్రైవేట్‌ దాఖలు చేశారు. విచారణలో నేరం రుజువు కావడంతో శ్రీనివాసరావుకు జైలుశిక్ష విధించడమే కాక ఫిర్యాదికి రూ.7.50లక్షలు చెల్లించాలని జడ్జి తీర్పు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement