
మురుగు.. కనుమరుగు
● మధిరలో రూ.128 కోట్లతో అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ ● 2,655 మ్యాన్‌హోల్స్.. 99.56 కి.మీ. పైపులైన్ ● ఏడాదిన్నరలో పూర్తిచేసేలా కార్యాచరణ
మధిర: మధిర మున్సిపాలిటీ కొత్తరూపు సంతరించుకోనుంది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సూచనలతో మధిరలో అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణానికి తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీయూఎఫ్‌ఐడీసీ) ద్వారా రూ.128 కోట్లు నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులతో దాదాపు 99.56 కి.మీ. మేర అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మించనున్నారు. పైపులైన్ విధానంలో నిర్మించే ఈ ప్రాజెక్టు పూర్తయితే మధిరలో డ్రెయినేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది.
6,638 నివాస గృహాలు
మధిర మున్సిపాలిటీ పరిధిలో 6,638 గృహాలు ఉన్నాయి. వీటి ద్వారా వెలువడేతున్న మురుగునీరు డ్రెయినేజీల ద్వారా ముందుకు సాగుతోంది. అయితే, అడ్డంకులు, అసంపూర్తి నిర్మాణాలతో నీరు నిలిచి, చెత్తాచెదారం పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతుండడమే కాక దోమల వృద్ధికి కారణమవుతోంది. చిన్నపాటి వర్షం వర్షం వచ్చినా నీరంతా రోడ్లపై చేరుతోంది. ఈ సమస్య పరిష్కారం కోసం అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా 2,655 మ్యాన్‌హోల్స్ ఏర్పాటుచేసి, 99.56 కి.మీ. నిడివితో పైపులైన్ నిర్మిస్తారు. ఇళ్లలో నుంచి నీటిని మ్యాన్‌హోల్స్‌లోకి.. అక్కడి నుంచి సబ్ లైన్స్, ఆపై ట్రంక్ మెయిన్ ద్వారా సీవేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్(మురికినీటి శుద్ధి కేంద్రం)కు పంపుతారు.
నాలుగు ఎస్‌టీపీలు..
అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణంలో భాగంగా మధిరను నాలుగు జోన్లుగా విభజించారు. పట్టణాన్ని మొదటి జోన్‌గా, మడుపల్లిని రెండో జోన్‌గా, అంబారుపేట, ఇల్లెందులపాడులో 3, 4వ జోన్లు నిర్ధారించారు. ఆయా జోన్లలోని లోతట్టు ప్రాంతాల్లో సీవేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు(ఎస్‌టీపీ) నిర్మించి అక్కడికి మురుగునీటిని మళ్లిస్తారు. అక్కడ నీటిని శుద్ధి చేసి వ్యవసాయ అవసరాలతో పాటు పార్క్‌లు, డివైడర్లు,, రోడ్ల పక్కన పెంచుతున్న మొక్కలకు వినియోగిస్తారు. ప్రస్తుతం ఇళ్లలో నుంచి వెలువడుతున్న మురుగునీరు నేరుగా వైరా నదిలో కలిసి కలుషితమవుతోంది. యూజీడీ పనులు పూర్తయితే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఈ పనులను ఒప్పందం ప్రకారం రెండేళ్లలో పూర్తి చేయాల్సి ఉండగా.. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఏడాదిన్నరలోనే పూర్తిచేయాలని సూచించారు. పనులు పూర్తయ్యాక ఐదేళ్లపాటు నిర్మాణ కంపెనీయే నిర్వహణ బాధ్యతలు చూసుకుంటుంది.
వర్షపు నీటికి ఎస్‌డబ్ల్యూడీ
మురుగునీరు ముందుకు సాగేలా అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మిస్తుండగా వర్షపునీటిని తరలించేందుకు స్టార్మ్ వాటర్ డ్రెయిన్(ఎస్‌డబ్ల్యూడీ) సిస్టమ్ నిర్మించనున్నారు. ఇందుకోసం రూ.75 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించారు. ఎస్‌డబ్ల్యూడీ కోసం 29.93 కి.మీ. మేర డ్రెయిన్లు నిర్మించాల్సి ఉంది. ఈ పనులూ పూర్తయితే వర్షపునీరు ఓపెన్ డ్రెయినేజీ సిస్టమ్ ద్వారా నేరుగా వెళ్లి వైరా నదిలో కలుస్తుంది.
మధిరలో నిర్మించే ఎస్‌టీపీలు, నీటిశుద్ధి సామర్ధ్యం
జోన్ శుద్ధి చేసే సామర్థ్యం
1 50 లక్షల లీటర్లు
2 9 లక్షల లీటర్లు
3 4 లక్షల లీటర్లు
4 5 లక్షల లీటర్లు
నాణ్యత ప్రమాణాలతో పనులు
డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క ఆదేశాలతో అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ పనులను నాణ్యతతో పూర్తి చేస్తాం. వృథా నీటిని శుద్ధి చేయడంతో ఇతర అవసరాలకు ఉపయోగపడతాయి. అంతేకాక పట్టణంలో దుర్వాసన, దోమల వృద్ధి సమస్యలు తగ్గిపోతాయి.
– నరేష్‌రెడ్డి, డీఈ, మధిర మున్సిపాలిటీ
రూ.కోట్ల నిధులతో అభివృద్ధి
మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి పనులకు డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క చొరవతో రూ.కోట్లలో నిధులు మంజూరవుతున్నాయి. అలాగే, పనుల నాణ్యతపై తరచుగా పర్యవేక్షిస్తున్నారు. యూడీజీ నిర్మాణ పనులు త్వరగా పూర్తయ్యేలా అందరూ సహకరించాలి.
– మల్లాది వాసు, మాజీ కౌన్సిలర్
సమస్యలకు శాశ్వత పరిష్కారం
మధిరలో ఓపెన్ డ్రెయినేజీ వ్యవస్థ కారణంగా మురుగునీరు నిలిచి అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. దుర్వాసన, దోమలతో ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. యూడీజీ నిర్మాణంతో సమస్యలు పరిష్కారమై పట్టణం పరిశుభ్రంగా మారుతుంది.
– కోనా ధనికుమార్, మాజీ కౌన్సిలర్

మురుగు.. కనుమరుగు

మురుగు.. కనుమరుగు

మురుగు.. కనుమరుగు

మురుగు.. కనుమరుగు