
కాల్వలు అధ్వానం..
తల్లాడ: 1977లో నిర్మించిన నాగార్జున సాగర్ (ఎన్నెస్పీ) కాల్వలు పదేళ్లుగా మరమ్మతులకు నోచుకోక అధ్వానంగా తయారయ్యాయి. మేజర్, మైనర్ కాల్వల్లో గుర్రపు డెక్క, చెత్త చెదారం, పూడిక పేరుకుపోయి పిచ్చి మొక్కలు, కంప చెట్లు దట్టంగా పెరగి సాగునీటి సరఫరాకు అడ్డుపడుతున్నాయి. మేజర్ కాల్వలపై ఆధారపడి మండలంలోని సిరిపురం, రామచంద్రాపురం, గూడూరు–1, 2, పుణ్యపురం, బస్వాపురం గ్రామాల్లో పంటలు పండిస్తున్నారు. వీటి కింద పలు మైనర్లు, సబ్ మైనర్లు కూడా ఉన్నాయి. కానీ, ఈసారి చివరి భూముల రైతులకు తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడింది. వారు రేయింబవళ్లు, కాల్వల వెంట తిరిగి నీరు పెట్టుకోవాల్సి వచ్చింది. అందుకు కారణం పదేళ్లుగా సాగర్ కాల్వలకు శాశ్వత మరమ్మతులు చేయకపోవటమే. కాల్వల్లో గుర్రపు డెక్క వ్యాపించింది. పూడిక పేరుకుంది. రెండు పక్కలా పిచ్చి మొక్కలు దట్టంగా మొలిచాయి.
సిబ్బంది కొరత.. పర్యవేక్షణ లోపం
ఎన్నెస్పీ సిబ్బంది కొరత, పర్యవేక్షణ లోపంతో కాల్వల నిండా పిచ్చి మొక్కలు పెరిగి, నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది. వేసవిలో లష్కర్లు కాల్వల్లో పిచ్చి మొక్కలు తొలగించాల్సి ఉన్నా.. ఆ సిబ్బంది కొరతతో మొక్కలు బాగా పెరిగాయి. అవి ఇలాగే ఉంటే ఖరీఫ్ సీజన్‌లోనూ నీరందటం కష్టమేనని రైతులు వాపోతున్నారు.
బలహీనంగా డ్రాప్‌లు
మేజర్, మైనర్ కాల్వలకు చెందిన డ్రాపులు, యూటీలు పలుచోట్ల కూలగా ఇప్పటికీ మరమ్మతులు చేయలేదు. కాల్వ కట్టలు బలహీనంగా మారాయి. పలుచోట్ల కోతకు గురై ఎక్కడ గండి పడుతుందోననే ఆందోళన వ్యక్తమవుతోంది. కొలబద్ధలు నామరూపాల్లేకుండా పోయాయి.
ఇప్పుడే అనుకూలం
ఏటా ఖరీఫ్‌కు ముందే కాల్వల్లో గుర్రపు డెక్క, పిచ్చి మొక్కలను తొలగించాలి. పేరుకుపోయిన పూడికను తీయాలి. నిధులే లేక పదేళ్లుగా కాల్వలకు మరమ్మతులు జరగకపోవడంతో 150 క్యూసెక్కుల నీటిని సరఫరా చేయాల్సిన మేజర్లలో 100 క్యూసెక్కులలోపు విడుదల చేస్తున్నారు. ఏటా చివరి ఆయకట్టు రైతులు కాల్వల చుట్టూ తిరగాల్సి వస్తోంది. కాల్వల మరమ్మతులకు ఈ రెండునెలలే అనుకూలం.
ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు?
గుర్రపు డెక్క, పిచ్చి మొక్కలతో
కమ్మేసిన సాగర్ కాల్వలు
పదేళ్లుగా కరువైన మరమ్మతులు
ఫలితంగా చివరి భూములకు
అందని సాగర్ నీరు
ఈ వేసవిలోనైనా మరమ్మతులు చేస్తే ఉపయోగం
తల్లాడ మండలంలో ఎన్నెస్పీ కాల్వల వివరాలు
ఆయకట్టు 21 వేల ఎకరాలు
గ్రామాలు 41
మేజర్ కాల్వలు 06
మైనర్లు 34
సిరిపురం మేజర్ 18.587 కి.మీ.
రామచంద్రాపురం 7.625 కి.మీ.
గూడూరు–1 2.400 కి.మీ.
గూడూరు–2 3.600 కి.మీ.
పుణ్యపురం 6.307 కి.మీ.
బస్వాపురం 4.840 కి.మీ.