
గంజాయి ముఠా అరెస్ట్
మధిర: ఒడిశా రాష్ట్రం నుంచి మధిరకు గంజాయి తీసుకొచ్చి విక్రయిస్తున్న ముఠాను మధిర టౌన్ ఎస్‌హెచ్‌ఓ, ట్రైనీ ఐపీఎస్ కొట్టే రిత్విక్‌స్వాయి అదుపులోకి తీసుకున్నారు. వివరాలను ఆదివారం టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఆయన వెల్లడించారు. ఈ నెల 2న ఆత్కూర్ క్రాస్ రోడ్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా పోలీస్ వాహనాన్ని చూసి ద్విచక్ర వాహనంపై బ్యాగులతో వస్తున్న ఇద్దరు వ్యక్తులు పారిపోయేందుకు యత్నించారు. వారిని అదుపులోకి తీసుకొని తనిఖీ చేయగా బ్యాగుల్లో సుమారు రూ.2 లక్షల విలువ చేసే 4 కేజీల గంజాయి దొరికింది. ఒడిశా రాష్ట్రంలోని పుష్పలంక ప్రాంతవాసి హంటర్ మధు నుంచి మధిర పట్టణానికి చెందిన మర్రి సుజిత్, తమ్మిశెట్టి ఏసుబాబు గంజాయి కొనుగోలు చేసి, ఇక్కడికి తీసుకొచ్చి 9 మందికి విక్రయించారని, వారు చిన్నచిన్న ప్యాకెట్లుగా చేసి పట్టణంలోని యువతకు విక్రయిస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు. వీరు ఇన్‌స్ట్రాగామ్ యాప్ ద్వారా మాట్లాడుకుంటూ గంజాయి రవాణా చేస్తున్నారని, మొత్తం 12 మందిపై కేసు నమోదు చేశామని రిత్విక్‌సాయి వెల్లడించారు. మర్రి సుజిత్, తమ్మిశెట్టి ఏసుబాబును రిమాండ్‌కు తరలించామని, ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేశామని వివరించారు.
ఇసుక తరలిస్తున్న వాహనాలు సీజ్
ఏపీ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా తెలంగాణకు అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న 3 టిప్పర్లు, ఎస్కార్ట్‌గా వస్తున్న మరో 3 వాహనాలను సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు మధిర ఎస్‌హెచ్‌ఓ, ట్రైనీ ఐపీఎస్ కొట్టే రిత్విక్‌స్వాయి తెలిపారు. ఆదివారం టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఈ నెల 2న అర్ధరాత్రి ఏపీలోని నందిగామ మీదుగా తెలంగాణకు అనుమతులు లేకుండా వస్తున్న 3 ఇసుక టిప్పర్లు, వాటికి ఎస్కార్ట్‌గా వస్తున్న 3 వాహనాలను రాయపట్నం సమీపంలో పట్టుకున్నారు. వాహనాల యజమాని, ఒక కాంట్రాక్టర్, 9 మందిపై కేసు నమోదు చేసి 8 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. అదనపు ఎస్‌ఐ చంద్రశేఖర్రావు పాల్గొన్నారు.