
రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు
● మెరుగైన సాగు పద్ధతులపై అన్నదాతలకు అవగాహన ● రేపటి నుంచి జూన్ 13 వరకు 30 సదస్సులకు షెడ్యూల్ ● ఆరు అంశాలపై సలహాలు, సూచనలు
మధిర/వైరా/ఖమ్మంవ్యవసాయం: వానాకాలం సాగుకు రైతులను సమాయత్తం చేసేలా ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించింది. మెరుగైన సాగు పద్ధతులపై అవగాహన కల్పించేందుకు ఈ నెల 5 నుంచి జూన్ 13వ తేదీ వరకు ‘రైతు ముగింట్లో శాస్త్రవేత్తలు’పేరిట ఈ కార్యక్రమ నిర్వహణకు ప్రణాళిక రూపొందించారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంతో కలిసి వైరాలోని కృషి విజ్ఞాన కేంద్రం, మధిరలోని వ్యవసాయ పరిశోధన స్థానం సంయుక్త ఆధ్వార్యన ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారుల సమన్వయంతో వానాకాలం పంటల సాగులో పాటించాల్సిన విధానాలపై అవగాహన కల్పించనున్నారు. వారానికి రెండు రోజుల చొప్పున ఆరు వారాల పాటు జిల్లాలోని రైతు వేదికల్లో ఈ కార్యక్రమాన్నినిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ సదస్సుల్లో శాస్త్రవేత్తలతో పాటు ఇద్దరు వ్యవసాయ కళాశాల విద్యార్థులు సైతం పాల్గొంటారు.
ఏమేం అంశాలంటే..
రైతు ముగింట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో భాగంగా ఆరు అంశాలపై అవగాహన కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. యూరియా వాడకాన్ని తద్వారా సాగు ఖర్చు తగ్గించడం, రసాయనాలను అవసరం మేరకే వినియోగిస్తూ నేలతల్లి ఆరోగ్యాన్ని కాపాడడం, రైతులు విత్తనాలు కొన్నప్పుడు రశీదు భద్రపరచుకోవడం, వివిధ పంటల్లో సాగునీటి ఆదా – భావితరాలకు అందించడం, పంట మార్పిడితో ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయడం, చెట్లు పెంచడం ద్వారా పర్యావరణాన్ని కాపాడడంపై అవగాహన కల్పిస్తారు.
ఆదాయం పెంపే లక్ష్యం
వ్యవసాయ, అనుబంధ రంగాల ద్వారా రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వనరుల ఆధారంగా పంటల సాగు, లాభదాయకమైన పంటల ఎంపిక, మెరుగైన యాజమాన్య పద్ధతులతో అధికోత్పత్తి సాధించడంపై అవగాహన కల్పిస్తారు. వ్యవసాయానికే పరిమితం కాకుండా అనుబంధ రంగాలపై దృష్టి సారించేలా చైతన్యం కల్పించనున్నారు. రైతుల ముంగిట్లోకి శాస్త్రవేత్తలను తీసుకెళ్లడం ద్వారా అవగాహన కల్పించడం సులువవుతుందని భావిస్తున్నారు.
సదస్సుల షెడ్యూల్ ఖరారు
‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’పేరిట సదస్సులు సోమవారం నుంచి నిర్వహించనుండగా షెడ్యూల్‌ను అధికారులు ఖరారు చేశారు. మొత్తంగా 40 రోజుల వ్యవధిలో జిల్లాలోని 21 మండలాల్లో 30 రైతు వేదికల్లో సదస్సులు నిర్వహిస్తామని జిల్లా వ్యవసాయ అధికారి ధనసరి పుల్లయ్య వెల్లడించారు. తొలిరోజైన ఈ నెల 5న సోమవారం ఖమ్మంపాడు, రాంక్యాతండాలో, 8న చింతకాని, 12న దెందుకూరు, ఖానాపురం, 13న మాటూరు, 14న గంగారం, 15న పాతలింగాల, 19న నాచారం, 20న మల్లవరం, 21న మడుపల్లి, 22న వేంసూరు, బీరోలు, పమ్మిలో సదస్సులు జరుగుతాయని తెలిపారు. అలాగే, 26న కుర్నవల్లి, 27న మీనవోలు, 28న రాయపట్నం, కొత్తూరు, 29న ముచ్చవరం, వెంకటాపురం (వేంసూరు), జూన్ 2న మధిర, తనికెళ్ల, 3న బనిగండ్లపాడు, 4న కాకర్లపల్లి, 5న కేజీ మల్లెల, 9న గోళ్లపాడు, 10న సిరిపురం, 11న సదాశివునిపాలెం, 12న అడసర్లపాడు, 13న బుచ్చిరెడ్డిపాలెంలో సదస్సులు నిర్వహిస్తామని వెల్లడించారు.
రైతులకు ప్రయోజనం
‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’కార్యక్రమం అన్నదాతలకు ఎంతో ప్రయోజనకరమైనది. వానాకాలం సాగు దృష్ట్యా ఈ కార్యక్రమ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నాం. సాగు సంబంధిత అన్ని అంశాలపై అవగాహన కల్పించి, నిపుణులతో సూచనలు ఇప్పిస్తాం.
–డాక్టర్ కె.రవికుమార్, కేవీకే ప్రోగ్రాం కో–ఆర్డినేటర్, వైరా

రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు