
జల్సాలకు అలవాటు పడి చోరీలు
సత్తుపల్లి: చెడు వ్యసనాలు, జల్సాలకు అలవాటు పడి చోరీలకు పాల్పడుతున్న ఇద్దరిని సత్తుపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. సత్తుపల్లి పట్టణ సీఐ టి.కిరణ్ శనివారం వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. ఏపీలోని విజయవాడ సమీపాన పాయకాపురానికి చెందిన దేవరకొండ రాంబాబు లారీక్లీనర్ కాగా పనిచేస్తూ మద్యం, పేకాట, వ్యభిచారానికి బానిసై చోరీలు మొదలుపెట్టాడు. ఈ క్రమంలో పోలీసులకు చిక్కిన ఆయన 1989 నుంచి ఆరేళ్ల జైలు శిక్ష అనుభవించగా పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు చెందిన బొమ్మల విజయ్ పరిచయం అయ్యాడు. అనంతరం వీరిద్దరు ఖమ్మం జిల్లా పరిధిలో పలుచోట్ల చోరీలు చేశారు. ఖమ్మంరూరల్, కల్లూరు, కామేపల్లి పోలీస్‌స్టేషన్లలో ఒక్కొక్కటి, మధిర పోలీస్‌స్టేషన్‌లో మూడు, సత్తుపల్లి పోలీస్‌స్టేషన్‌లో రెండు కేసులు నమోదు కాగా, చోరీ సొత్తును చిలకలూరిపేటకు చెందిన కొలిశెట్టి నాగరాజుకు అమ్మి ఆ సొమ్ముతో జల్సాలు చేసేవారు. ఈ క్రమంలో పక్కా సమాచారంతో రాంబాబు, విజయ్‌ను అరెస్ట్ చేశామని సీఐ కిరణ్ తెలిపారు. సమావేశంలో ఎస్‌ఐ వీరేందర్, సిబ్బంది పాల్గొన్నారు.
ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు