
చేతులు కాలకముందే..
● ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల ఇష్టారాజ్యంగా హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు ● కొన్నిచోట్ల అనుమతికి మించి.. ఇంకొన్ని చోట్ల అనధికారికంగా ఏర్పాటు ● సంస్థల నిర్లక్ష్యంపై దృష్టి సారించని యంత్రాంగం ● ముందస్తు చర్యలు తీసుకుంటేనే మేలు..
ఖమ్మంమయూరిసెంటర్: వివిధ కంపెనీలు, వ్యా పార సంస్థలు తమ ఉత్పత్తుల ప్రచారానికి నగర, పురపాలికల్లో భారీ హోర్డింగ్‌లు ఏర్పాటు చేస్తున్నా యి. ఈ క్రమంలో నిబంధనలు విస్మరించి, అనుమతికి మించి భారీస్థాయిలో ఫ్లైఓవర్ల వెంట, ఇతర రద్దీ ప్రాంతాలు, బైపాస్‌ల వెంట భవనాలపై ఏర్పాటు చేస్తుండడంతో భారీ ఈదురుగాలులు, వర్షాల సమయాన కూలిపడతాయోననే ఆందోళన వ్యక్తమవుతోంది. ఖమ్మం కార్పొరేషన్‌తోపాటు సత్తుపల్లి, మధి ర, వైరా, ఏదులాపురం, కొత్తగూడెం, మణుగూరు, పాల్వంచ, ఇల్లెందు, అశ్వారావుపేట మున్సిపాలిటీల్లో హోర్డింగ్‌ల సంఖ్య నానాటికీ పెరుగుతున్నా అధికారులు దృష్టి సారించకపోవడం గమనార్హం.
నిబంధనలు గాలికి..
వ్యాపార, వాణిజ్య సంస్థల ప్రకటన కోసం ప్రైవేట్ యాడ్ ఏజెన్సీలు మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల అనుమతి తీసుకుని హోర్డింగ్‌లు ఏర్పాటు చేస్తారు. ఇందుకోసం భవన బేస్‌మెంట్ పిల్లర్లతో అనుసంధానంగా పటిష్టంగా పిల్లర్ నిర్మించి రాడ్లు బిగించాలి. అంతేకాక ఫ్లైఓవర్ల పక్కన కనీసం 10 మీటర్ల దూరంలోనే ఏర్పాటుచేయాలి. భవనాలపై హోర్డింగ్‌లు ఏర్పాటుచేశాక ఏటా పిల్లర్ల బలాన్ని పరిశీలించాలి. శిథిలావస్థకు చేరిన భవనాలు, పిల్లర్లపై హోర్డింగ్‌లు ఏర్పాటు చేయడంపై నిషేధం ఉంది. అంతేకాక హోర్డింగ్‌లకు ఏర్పాటు చేసే ఫ్లెక్సీలు చిరిగితే గాలిలో వేలాడకుండా తాళ్లతో బిగించాలి. సగం మేర చినిగినా, ముక్కలైనా వెంటనే తొలగించాల్సి ఉన్నప్పటికీ ఎక్కడా ఈ నిబంధనలు పాటించడం లేదు.
పోటాపోటీగా ఏర్పాటు
ఉమ్మడి జిల్లా వ్యాపార, వాణిజ్య రంగాల్లో దూసుకుపోతోంది. కొత్తగా పలు సంస్థల బ్రాంచ్ లు ఏర్పాటవుతున్నాయి. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రాల్లో వీటి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. వీటి మధ్య పోటీ కారణంగా జనాన్ని ఆకట్టుకునేందుకు ఒకరికి మించి ఒకరు భారీ హోర్డింగ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ హోర్డింగ్‌ల ద్వారా వచ్చే ఆదాయాన్ని చూస్తున్న అధికారులు నాణ్యతను మాత్రం పట్టించుకోవడం లేదు.
వీటికే అనుమతులు..
ఖమ్మంలో సుమారు 300 వరకు హోర్డింగ్‌లు ఉన్నట్లు అంచనా. అయితే, అధికారికంగా 240 హోర్డింగ్‌లకే అనుమతి ఉంది. సత్తుపల్లిలో 25 వరకు హోర్డింగ్‌లుంటే 14కు, మధిరలో 14 ఉండగా.. నాలుగింటికే అనుమతి ఉంది. అలాగే, వైరాలో 20 హోర్డింగ్‌లు ఉండగా పన్నులు విధించిన దాఖలాలు లేవనే చెప్పాలి. ఏదులాపురంలో మూడు హోర్డింగ్‌లు ఉండగా దేనీకి అనుమతి లేనట్లు సమాచారం. కొత్తగూడెం మున్సిపాలిటీలో 25 హోర్డింగ్‌లు ఉండగా 16కు మాత్రమే అనుమతులు ఉన్నాయి. పాల్వంచలో ప్రధాన రహదారుల వెంట 15 హోర్డింగ్‌లు కనిపిస్తుండగా అన్నింటికీ అనుమతులు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఇల్లెందులో ఏడు హోర్డింగ్‌లకు గాను అన్నింటికీ అనుమతులు ఉన్నాయని రికార్డులు చెబుతున్నాయి. కానీ ఈ రెండు చోట్ల అనధికారికంగా పెద్దసంఖ్యలో హోర్డింగ్‌లు ఏర్పాటైనా అధికారులు పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. ఇక మణుగూరులో రెండు హోర్డింగ్‌లకు గాను దేనికీ అనుమతి లేకపోవడం గమనార్హం.
ఖమ్మంలోని ప్రధాన రహదారి వైరా రోడ్డుకు ఇరువైపులా భవనాలపై భారీ హోర్డింగ్‌లు ఉన్నాయి. వీటిపై ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాంటివేవీ పాటించకపోవడంతో ఫ్లెక్సీలు గాలికి చిరిగి వేలాడుతున్నాయి. ఇంకొన్ని చోట్ల ఫ్లెక్సీలు ఎగిరొచ్చి విద్యుత్ తీగలపై పడడంతో సరఫరాకు అవాంతరాలు ఎదురవుతున్నాయి. ఇదికాక హోర్డింగ్‌లను పటిష్టంగా ఏర్పాటు చేయకపోవడంతో కూలిపడతాయేమోననే స్థానికుల్లో వ్యక్తమవుతోంది.
అశ్వారావుపేటలో మూడు హోర్డింగ్‌లు ఏర్పాటు చేయగా.. ఒక హోర్డింగ్ రోడ్డు విస్తరణలో భాగంగా తొలగించారు. మిగిలినవి పోలీస్ స్టేషన్ వద్ద, టెలిఫోన్ ఎక్సేంజి వద్ద ఉన్నాయి. ఇటీవల భారీ గాలిదుమారానికి టెలిఫోన్ ఎక్సేంజి వద్ద భవనంపై ఉన్న హోర్డింగ్ పడిపోయింది. అయితే, ఆ హోర్డింగ్ రాడ్లు భవనంపైనే ఆగడంతో ప్రమాదం తప్పింది.

చేతులు కాలకముందే..

చేతులు కాలకముందే..