మధిర(చింతకాని): వివాహేతర సంబంధం కొనసాగిస్తుందనే అనుమానంతో ఓ వ్యక్తి తన భార్యపై రోకలిబండతో దాడి చేసి తీవ్రంగా గాయపర్చాడు. చింతకాని మండలం బస్వాపురంలో ఈ ఘటన శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రసపుత్ర ముత్తారావు లారీ డ్రైవర్‌గా పనిచేస్తుండగా, ఆయన భార్య లలిత ప్రవర్తనపై కొన్నాళ్లుగా అనుమానం పెంచుకున్నాడు. తరచుగా శారీరకంగా, మానసికంగా వేధిస్తుండగా, శుక్రవారం రాత్రి కూడా గొడవ జరిగింది. అప్పటికే మద్యం మత్తులో ఉన్న ముత్తారావు తన భార్యను హతమార్చాలని నిర్ణయించుకుని శనివారం తెల్లవారుజామున నిద్రిస్తున్న ఆమె తలపై రోకలిబండతో కొట్టాడు. దీంతో లలిత ఆమె తలకు తీవ్ర గాయమై అపస్మారక స్థితిలోకి వెళ్లిపోవడంతో ఆందోళనకు గురైన ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఆతర్వాత స్థానికులు ఆమెను ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. కాగా, నిందితుడు ముత్తారావు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తుండగా, వైరా సీఐ సాగర్, ఎస్సై నాగుల్‌మీరా గ్రామానికి చేరుకుని వివరాలు ఆరా తెలుసుకున్నారు. ఘటనపై బాధితురాలి అన్న నాగేంద్రప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నాగుల్‌మీరా తెలిపారు.
వివాహేతర సంబంధం.. అనుమానంతో ఘటన