
నాగరాణి (ఫైల్)
ఖమ్మంమయూరిసెంటర్: అధికారులు మందలించారనే మనస్తాపంతో గడ్డి మందు తాగిన ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పారిశుద్ద్య కార్మికురాలు మహంకాలి నాగరాణి(30) చికిత్స పొందుతూ మృతి చెందింది. బంధువుల కథనం ప్రకారం.. నాగరాణి భర్త అప్పారావు కొన్నేళ్ల క్రితం మృతి చెందడంతో ఆమె ఔట్ సోర్సింగ్ విధానంలో పారిశుద్ధ్య కార్మికురాలిగా విధులు నిర్వర్తిస్తూ ఇద్దరు కుమార్తెలను పోషిస్తోంది. నగరంలోని రాపర్తినగర్‌లో ఉండే ఆమె ఇటీవల కేఎంసీలో ఉద్యోగాలు ఇప్పిస్తానని డబ్బు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో నాగరాణిని జవాన్ జ్యోతి ఈ నెల 18న కేఎంసీ కార్యాలయంలోని అసిస్టెంట్ కమిషనర్ వద్దకు తీసుకొచ్చింది. ఈక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ మల్లీశ్వరి ఉద్యోగాల పేరుతో డబ్బు వసూలు చేయడం ఏమిటని చేయడమేమిటని ప్రశ్నిస్తూ తిరిగి చెల్లించాలని, జరిగిదంతా పేపర్‌పై రాసి సంతకం చేయాలని మందలించినట్లు నాగరాణి తల్లి, సోదరుడు ఆరోపించారు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె ఆదివారం రాత్రి ఇంట్లోనే గడ్డి మందు తాగగా బంధువులు ఖమ్మం ఆస్పత్రికి తీసుకెళ్లి పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ ఈఎస్‌ఐ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ నాగరాణి మంగళవారం మృతి చెందింది. ఈ విషయమై అధికారులు స్పందిస్తూ ఉద్యోగం ఇప్పించేందుకు డబ్బు తీసుకున్నట్లు, తిరిగి చెల్లించేందుకు నాగరాణి అంగీకరించిందని, ఘటనపై విచారణ చేస్తుండగానే మరుసటి రోజు ఆమె పురుగుల మందు తాగిందని వెల్లడించారు.
ఏసీ, జవాన్లపై కేసు
ఖమ్మంక్రైం: కేఎంసీ అసిస్టెంట్ కమిషనర్ మల్లీశ్వరి, ఇద్దరు సిబ్బందిపై కేసు నమోదు చేసినట్లు ఖమ్మం టూటౌన్ సీఐ శ్రీధర్ తెలిపారు. పారిశుద్ధ్య కార్మి కురాలు నాగరాణి విషయంలో జవా న్లు సూరేపల్లి శ్రీను, గణేష్ జ్యోతి అసిస్టెంట్ కమిషనర్ మల్లీశ్వరికి ఫిర్యాదు చేయడంతో ఆమె దూషించడాన్ని తట్టుకోలేక గడ్డి మందు తాగిందని బంధువులు ఫిర్యాదు చేశారు. దీంతో అసిస్టెంట్ కమిషనర్, ఇద్దరు జవాన్లపై హత్యాయత్నం క్రింద కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.