చింతకాని: మండలంలోని పందిళ్లపల్లిలో ఇంట్లో ఒంటరిగా ఉన్న వృద్ధురాలి మెడలో బంగారు గొలుసును మంగళవారం గుర్తు తెలియని దుండగుడు లాక్కొని పరారయ్యాడు. గ్రామానికి చెందిన ఇనుకుళ్ల నారాయణమ్మ భర్త గాంధీరెడ్డి పొలానికి వెళ్లగా, ఆమె ఒంటరిగా ఉంది. దీంతో మాస్క్ ధరించిన దుండగుడు ఫోన్ మాట్లాడుతూ ఇంట్లోకి ప్రవేశించి ఆమె మెడలోని సుమారు మూడు తులాల బంగారు గొలుసు లాక్కుని పరారయ్యాడని ఎస్సై పొదిల వెంకన్న తెలిపారు.
కోదండ రామాలయంలో చోరీ
ముదిగొండ: మండలంలోని న్యూలక్ష్మీపురం కోదండ రామాలయంలో సోమవారం రాత్రి చోరీ జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు ఆలయంలోని హుండీ తాళం పగలుగొట్టి సుమారు రూ.20వేల నగదు చోరీ చేశారు. ఘటనపై సర్పంచ్ కన్నయ్య ఇచ్చిన ఫిర్యాదుతో ఎస్సై నాగరాజు దర్యాప్తు చేపట్టారు.
ఎర్త్ పైపుల చోరీకి యత్నం
నేలకొండపల్లి: మండలంలోని రాజేశ్వరపురం–శంకరగిరితండా మధ్య ట్రాన్స్‌ఫార్మర్ ఎర్త్ పైపులు చోరీ చేసేందుకు మంగళవారం మధ్యాహ్నం గుర్తుతెలియని వ్యక్తులు ప్రయత్నించారు. అయితే, సమీప రైతులు గుర్తించి కేకలు వేయడంతో దొంగలు బైక్‌పై పరారయ్యారు. దీంతో రైతులు కూడా కాసేపు వెంబడించినా చిక్క లేదు. దుండుగులు బైక్‌పై వెళ్తున్న దృశ్యాలు రాజేశ్వరపురం వైన్స్ సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. రాజేశ్వరపురం ఏఈ బాలాజీ మాట్లాడుతూ అపరిచిత వ్యక్తులు కనిపిస్తే రైతులు పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
వేసిన తాళం వేసినట్లే.. బంగారం మాత్రం చోరీ
ఖమ్మంక్రైం: ఖమ్మం వీడీవోస్ కాలనీలోని ఓ ఇంట్లో పట్టపగటే చోరీ జరిగింది. పోలీసుల కథనం ప్రకా రం... వీడీవోస్ కాలనీలో నివాసముండే భూక్యా ప్రసాద్ గ్రానైట్ ఫ్యాక్టరీలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తుండగా, ఆయనతో పాటు కుటుంబీకులు మంగళవారం ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లారు. పరీక్ష రాయడానికి వెళ్లిన ఆయన పిల్లలతో పాటు కుటుంబీకులు మధ్యాహ్నం ఇంటికి వచ్చాక బీరులో చూస్తే 25 తులాల బంగారు ఆభరణాలు కనిపించలేదు. అయితే, ఇల్లు, బీరువా తాళం వేసినట్లే ఉండడంతో ఎలా చోరీ జరిగిందనేది తెలియరాలేదు. కాగా, వారు వెళ్లేటప్పుడు ఇంటి తాళం బయట ఉన్న బూట్లలో పెట్టి వెళ్లగా, తెలిసిన వారే చోరీ చేసి మళ్లీ తాళం పెట్టి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు టూటౌన్ పోలీసులు తెలిపారు.