కోలారు: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల సురక్షత విషయంలో బాధ్యతారహితంగా వ్యవహరిస్తే సహించేది లేదు. భవిష్యత్తులో ఏవైనా ప్రమాదాలు జరిగితే సంబంధిత తాలూకా బీఈఓ, పాఠశాల ప్రధానోపాధ్యాయులనే బాధ్యులను చేయడం జరుగుతుందని జిల్లా పంచాయతీ సీఈఓ ప్రవీణ్ పి బాగేవాడి హెచ్చరించారు. శుక్రవారం జిల్లా పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన పాఠశాల గదుల మరమ్మతులపై ప్రగతి పరిశీలన సమావేశంలో మాట్లాడారు. రెండు రోజుల క్రితం నగరంలోని ప్రభుత్వ పాఠశాలలో పైకప్పు పెచ్చులు ఊడి ఉపాధ్యాయురాలు గాయపడిన నేపథ్యంలో సీఈఓ అత్యవసర సమావేశాన్ని నిర్వహించి విద్యాశాఖ అధికారులను హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా శిథిలావస్థలో ఉన్న మరమ్మతులు చేయాల్సిన పాఠశాల గదులు, అంగనవాడీ కేంద్రాల కచ్చితమైన సమాచారాన్ని వచ్చే మూడు రోజులల్లో సమర్పించాలని తెలిపారు. ప్రమాదకరంగా ఉన్న గదులలో విద్యార్థులను కూర్చోపెట్టొదని తెలిపారు. జిల్లా పంచాయతీలో వివిధ హెడ్‌ల కింద ఉన్న నిధులతో పాఠశాలలో గదులకు మరమ్మతులు చేయాలని సూచించారు. గ్రామ పంచాయతీ సహకారంతో అంగనవాడీలకు మరమ్మతులు చేయాలని సీడీపీఓలకు తెలిపారు. సమావేశంలో జిల్లా పంచాయతీ ఉప కార్యదర్శి టి.కె.రమేష్, పాల్గొన్నారు.


