మైసూరు: మైసూరు నగరంలోని మెటగళ్లిలో ఉన్న ప్రభుత్వ జయదేవ ఆస్పత్రిలో గత 24 గంటల్లో 11 మంది రోగులు మరణించినట్లు ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ డా.సదానంద తెలిపారు. ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ మృతుల పేర్లను వెల్లడించారు. సయ్యద్ ఆరీఫ్ పాషా (80), హరీష్ బీఆర్ (40), బాలశంకర్ (65), షంశున్నీసా(70), రాజు (54), నింగేగౌడ (70), హసీనాబాను (58), గోపాలరాజు (55), బైరోజీ రావ్ (80), సుహైల్‌ఖాన్ (43), నీలి (79) మృతులు. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకు చికిత్స పొందుతూ మరణించారు, వైద్యుల కొరత, నిర్లక్ష్యం లేదన్నారు. తమవారు ఆకస్మికంగా చనిపోయారని, ఇక్కడ వైద్య సౌకర్యాలు బాగాలేవని మృతుల బంధువులు వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీంతో ఆస్పత్రిపై అందరి దృష్టి పడింది.
చికిత్స అందించాం: డైరెక్టర్
రోగుల మరణం కేసుల్లో ఆస్పత్రికి మసి పూసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ దినేశ్ అన్నారు. ఆస్పత్రిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ 11 మంది రోగులు గోల్డెన్ అవర్ ముగిసిన తర్వాత వచ్చారని, అయినా ఐసీయూలో ఉంచి చికిత్స అందించినట్లు తెలిపారు. 11 మందీ గుండెపోటుతో వచ్చిన వారే, అందులోనూ బాగా వయసైనవారని అన్నారు. జీవన్మరణ పరిస్థితుల్లో ఆస్పత్రికి తీసుకొచ్చారన్నారు. వైద్యుల కొరత లేదని, కొంతమంది అసత్యాలు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. తమ ఆస్పత్రికి ప్రతిరోజూ 600 నుంచి 800 మంది రోగులు వస్తారని, 20 శాతం మంది తీవ్ర అనారోగ్యంతో ఉన్నవారని ఆయన తెలిపారు. తమ వద్ద మొత్తం 40 మంది వైద్యులు ఉన్నారని చెప్పారు.
24 గంటల్లో 11 మంది మృతి
బంధువుల ఆరోపణలు


