హీటెక్కిన బిడది టౌన్‌షిప్‌ | - | Sakshi
Sakshi News home page

హీటెక్కిన బిడది టౌన్‌షిప్‌

Jun 18 2026 12:53 AM | Updated on Jun 18 2026 12:53 AM

శివాజీనగర: బిడది టౌన్‌షిప్‌ ఇప్పుడు రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌ అయ్యింది. టౌన్‌షిప్‌ అవసరమని డీకే సర్కారు చెబుతోంటే, రైతుల భూములు తీసుకోవద్దని ప్రతిపక్షాలు కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో రైతులపై ప్రభుత్వం రాజకీయం చేయడం మానుకోవాలని బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు, ఎమ్మెల్యే బీ.వై.విజయేంద్ర అన్నారు. బుధవారం బీజేపీ నాయకులు బిడదిలో పర్యటించి రైతులతో మాట్లాడారు. ఇక్కడి సర్కారు ఏర్పాటు చేస్తున్న టౌన్‌షిప్‌కు తమ భూములు ఇవ్వబోమని రైతులు వ్యతిరేకించడం తెలిసిందే. కాషాయ నాయకులు ఆ ప్రాంతంలో పర్యటించి రైతులతో మాట్లాడారు. విజయేంద్ర స్పందిస్తూ ‘ప్రభుత్వం 80 శాతం మంది రైతులు భూస్వాధీనానికి ఆమోదించారని చెబుతోంది. ఇక్కడ భూమి బీడు భూమి అంటున్నారు, బిడది టౌన్‌షిప్‌కు ప్రధాని నరేంద్ర మోదీ ఆమోదించారని ముఖ్యమంత్రి తెలిపారు. అయితే ప్రధాని ఆమోదించలేదు. రాష్ట్ర ప్రభుత్వం పిల్ల చేష్టలు చేస్తోంది’ అని ఆరోపించారు. అనేక పల్లెలకు వెళ్లి రైతులను మాట్లాడాము, వాస్తవాలు తెలియజేసేందుకు సిద్ధమయ్యామే గాని రాజకీయం చేయడం లేదన్నారు. దేశానికి అన్నంపెట్టే రైతులకు అండగా ఉంటాం, కానీ కాంగ్రెస్‌ ప్రభుత్వానిది రైతు వ్యతిరేక ధోరణి అని ఆరోపించారు. ఇక్కడి ఎంతోమంది రైతులు టెంకాయ, వక్క, మల్బరీ తోటలు సాగు చేస్తున్నారు, ఇలాంటి సారవంతమైన భూమిని రైతులతో బలవంతంగా లాక్కొనేందుకు ప్రభుత్వం సిద్ధమైందని ఆరోపించారు.

బెదిరిస్తున్నారు

రాత్రివేళ గూండాలు ఇళ్లకు వచ్చి బెదిరిస్తున్నారని కొందరు రైతులు నేతలకు చెప్పారు. తమ ప్రాణాలైనా ఇస్తాం, భూమిని విడిచిపెట్టబోమని తెలిపారు. విజయేంద్ర మాట్లాడుతూ సీఎం డీ.కే.శివకుమార్‌కు రియల్‌ ఎస్టేట్‌ చేయాలనుకుంటే చాలా చోట్ల స్థలముంది. ఇక్కడ చిన్నరైతులు బతకాలి. ఇందులోకి మోదీ పేరును ఇక్కడ లాగడం డీకే శివకుమార్‌కు సిగ్గుచేటు అని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో సీనియర్లు ఆర్‌.అశోక్‌, చలవాది నారాయణస్వామి పాల్గొన్నారు.

ఆ గ్రామాల్లో బీజేపీ నేతల పర్యటన

రైతుల భూములను లాక్కోవద్దని డిమాండ్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement