శాశ్వత కూరగాయల మార్కెట్‌కు వినతి | - | Sakshi
Sakshi News home page

శాశ్వత కూరగాయల మార్కెట్‌కు వినతి

Jun 18 2026 12:53 AM | Updated on Jun 18 2026 12:53 AM

రాయచూరు రూరల్‌: గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే కూరగాయలను విక్రయించే వారికి శాశ్వత కూరగాయల మార్కెట్‌ను కల్పించాలని ఎం.ఈరణ్ణ కూరగాయల మార్కెట్‌ సంఘం డిమాండ్‌ చేసింది. బుధవారం నగరసభ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో సంచాలకులు వసీం మాట్లాడారు. కరోనా సమయంలో ప్రజలు, వినియోగదారుల అనుకూలం కోసం ఏర్పాటు చేసిన మార్కెట్‌ను కాదని నగరసభ ఆధ్వర్యంలో నడిచే మార్కెట్‌లో వ్యాపారాలు జరపడం కష్టమన్నారు. నూతనంగా జహీరాబాద్‌ మురికి వాడల ప్రాంతంలో శాశ్వత కూరగాయల మార్కెట్‌ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ నగరసభ అదనపు కమిషనర్‌ సంతోష్‌రాణికి వినతిపత్రం సమర్పించారు.

చెరువులో స్నానానికి

వెళ్లి వ్యక్తి మృతి

హుబ్లీ: జిల్లాలోని కలఘటికి తాలూకా నీలసాగర చెరువులో స్నానానికి వెళ్లిన ఓ యువకుడు నీటిలో మునిగి మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తిని హుబ్లీ సిద్ధారూఢ మఠం క్రాస్‌లోని శివశంకర కాలనీ నివాసి సుమీత్‌ బసవరాజ కోతంబరి(22) గా గుర్తించారు. మధ్యాహ్నం సుమారు 2 నుంచి 4 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుందని తెలిసింది. కలఘటికి స్టేషన్‌లో మృతుడి తండ్రి బసవరాజ్‌ ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.

రైలు నుంచి పడి వ్యక్తి మృతి

మరో ఘటనలో రైలు నుంచి పడి ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. వేగంగా వెళుతున్న రైలు నుంచి గుర్తు తెలియని వ్యక్తి కింద పడి మృతి చెందిన ఘటన సవణూరు రైల్వే స్టేషన్‌ దగ్గర చోటు చేసుకుంది. సుమారు 70 నుంచి 75 ఏళ్ల వయస్సుగల వ్యక్తి ఈ ఘటనలో మృతి చెందారు. అతడి ఆచూకీ తెలిసిన వారు ఎవరైనా ఉంటే హుబ్లీ రైల్వే స్టేషన్‌లో సంప్రదించాలని పోలీసులు కోరారు.

కేపీఎస్‌లో పాఠశాలల విలీనం తగదు

రాయచూరు రూరల్‌: రాష్ట్ర సర్కార్‌ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను కర్ణాటక పబ్లిక్‌ పాఠశాల(కేపీఎస్‌)ల్లో విలీనం చేయడం తగదని ఏఐడీఎస్‌ఓ డిమాండ్‌ చేసింది. బుధవారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు చెన్న బసవ మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రాథమిక పాఠశాలలను కేపీఎస్‌ల్లో చేర్చడాన్ని విరమించుకోవాలని ఒత్తిడి చేశారు. గ్రామీణ, నగర ప్రాంతాల్లో పాఠశాలలను విలీనం చేయడం సరికాదంటూ జిల్లాధికారికి వినతిపత్రం సమర్పించారు.

విత్తనాలు, ఎరువుల

పంపిణీకి డిమాండ్‌

రాయచూరు రూరల్‌: ఖరీఫ్‌ సీజన్‌లో రైతులకు విత్తనాలు, ఎరువుల కొరత రాకుండా చూడాలని, వాటిని సక్రమంగా పంపిణీ చేయాలని కర్ణాటక రైతు సంఘం డిమాండ్‌ చేసింది. జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో సంచాలకుడు చామరస మాలిపాటిల్‌ మాట్లాడారు. ఖరీఫ్‌లో ముందుగానే వానలు కురువడం జరిగిందని, రైతులు విత్తనాలు, ఎరువులు సిద్ధం చేసుకుంటున్న తరుణంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండ చూడాలన్నారు. నకిలీ విత్తనాల బెడద నియంత్రణకు ముందుకు రావాలన్నారు. పెరిగిన ఎరువులు, డీజిల్‌, పెట్రోల్‌, వంట గ్యాస్‌, క్రిమి సంహారక మందుల ధరలు నింగినంటాయన్నారు. తుంగభద్ర ఎడమ కాలువలో పేరుకున్న పూడికను తొలగించాలని కోరుతూ ఆందోళన చేపట్టారు.

అప్పు చెల్లించమన్నందుకు

వ్యక్తి హత్య

కోలారు: అప్పుగా తీసుకున్న డబ్బు తిరిగి చెల్లించమన్నందుకు ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన మంగళవారం రాత్రి నగరంలోని నిసార్‌ నగర్‌లో చోటు చేసుకుంది. బీడీ కాలనీ నివాసి అల్తాఫ్‌ (45) హత్యకు గురైన వ్యక్తి. ఇమ్రాన్‌ అనే వ్యక్తి అల్తాఫ్‌ నుంచి వడ్డీకి డబ్బును అప్పుగా తీసుకున్నాడు. ఈమధ్య తన డబ్బు వాపసు ఇవ్వాలని పదే పదే ఇమ్రాన్‌ను అల్తాఫ్‌ డిమాండ్‌ చేస్తుండడంతో విసిగిన ఇమ్రాన్‌ కత్తితో నరికి హత్య చేశాడు. అనంతరం పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి లొంగి పోయాడు. రూరల్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం అనంతరం సంబంధీకులకు అప్పగించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement