25న టీబీ డ్యాం కొత్త గేట్ల ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

25న టీబీ డ్యాం కొత్త గేట్ల ప్రారంభం

Jun 18 2026 12:53 AM | Updated on Jun 18 2026 12:53 AM

హొసపేటె: తుంగభద్ర డ్యాంకు సుమారు రూ.50.6 కోట్లు ఖర్చు చేసి 33 కొత్త క్రస్ట్‌గేట్ల అమరిక, గొలుసుల బిగింపు పనులు తుది దశకు చేరుకున్నాయి. కర్ణాటక, ఆంఽధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సమక్షంలో ఈనెల 25న కొత్త గేట్ల ప్రారంభోత్సవం జరగనుంది. ఈ జలాశయాన్ని పెళ్లికూతురిలా అలంకరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్‌ పటేల్‌తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డీసీఎం పవన్‌ కళ్యాణ్‌, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, కొందరు మంత్రులు, సీనియర్‌ అధికారులు హాజరు కానున్నారు. ప్రస్తుతం తుంగభద్ర జలాశయం వద్ద క్రస్ట్‌గేట్లకు గొలుసులను బిగిస్తున్నారు. ఈ చారిత్రాత్మక కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించాలని ముఖ్యమంత్రి ఇప్పటికే అధికారులను ఆదేశించారు.

గొలుసుల అమరిక పనులు దాదాపు పూర్తి

తుంగభద్ర డ్యాంలోని కొత్త 33 క్రస్‌గేట్లకు కొత్త గొలుసులను అమర్చే పని దాదాపుగా పూర్తయింది. ఈనేపథ్యంలో కేంద్ర మంత్రి, మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రుల చేతుల మీదుగా డ్యాం కొత్త క్రస్ట్‌గేట్లు ప్రారంభిస్తారు. జలాశయం వద్ద ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రముఖుల రాక కోసం హెలిప్యాడ్‌లను సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వం సీనియర్‌ అధికారులు, వీవీఐపీలు, వివిధ రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రముఖులు ఒకేసారి ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ట్రాఫిక్‌కు ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నారు. విజయనగర, కొప్పళ జిల్లా అధికారులు భారీ ప్లాట్‌ఫాం నిర్మాణంతో పాటు ఇతర పనులతో బిజీగా ఉన్నారు. హొసపేటె, కొప్పళ నుంచి టీబీడ్యాంకు వెళ్లే అన్ని రోడ్లకు మరమ్మతులు జరుగుతున్నాయి.

ప్రారంభోత్సవానికి రానున్న కేంద్రమంత్రి

హాజరు కానున్న మూడు రాష్ట్రాల సీఎంలు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement