అగస్తేశ్వర బ్రహ్మ రథోత్సవం | - | Sakshi
Sakshi News home page

అగస్తేశ్వర బ్రహ్మ రథోత్సవం

May 1 2026 6:03 AM | Updated on May 1 2026 6:03 AM

కోలారు: ముళబాగిలు నగరంలోని పురాణ ప్రసిద్ధ శ్రీ సీతాపతి, శ్రీ రామచంద్ర, అగస్తేశ్వర స్వామి బ్రహ్మ రథోత్సవ వేడుకలు భక్తిశ్రద్ధలతో జరిగాయి. ఆలయంలో మూలవిరాట్టుకు పంచామృత అభిషేకం నిర్వహించారు, గణపతి పూజ, కళశారాధన, నవగ్రహ శాంతిహోమం జరిపించారు. తేరులో ఉత్సవమూర్తిని ప్రతిష్టించి ఊరేగించారు. తేరు కదలగానే భక్తులు అరటి పండ్లు, పూలు, దవనం విసిరారు.

ప్రయాణికుల వాహనాలపై పన్నుల తగ్గింపు

దొడ్డబళ్లాపురం: రాష్ట్రంలో అన్ని రకాల ధరలు, బిల్లులు పెరుగుతున్న సమయంలో ఇదొక శుభవార్త కిందే లెక్క. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా సవరించిన మోటారు వాహనాల చట్టం బిల్లు మే 1 నుంచి అమలులోకి రానుంది. ఈ మేరకు ప్రభుత్వం రవాణా శాఖకు ఆదేశాలిచ్చింది. మోటారు వాహనాలపై పన్నులు తగ్గుతాయి. 12 మంది కంటే ఎక్కువ మందిని తీసుకువెళ్లే వాహనాలపై ప్రతి సీటుకి విధిస్తున్న పన్నులో రూ.1000 తగ్గించారు. ఎక్కువ పన్నులు వసూలు చేస్తుండడం వల్ల వాహనాల యజమానులు పక్క రాష్ట్రాల్లో వాహనాల రిజిస్ట్రేషన్‌లు చేయించేవారు. దీంతో ప్రభుత్వం ఖజానాకు గండిపడుతోందని తెలిసి సవరణ చేసింది.

భక్తిశ్రద్ధలతో ఉపనయనాలు

మైసూరు: నగరంలోని శ్రీ కృష్ణ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో టీకే లేఔట్‌లోని శ్రీకృష్ణధామంలో గురువారం ఉచిత సామూహిక ఉపనయన బ్రహ్మోపదేశం క్రతువును నిర్వహించారు. వటువులచే శోభాయాత్ర, అశ్వత్థ పూజ సాగింది. పెద్దసంఖ్యలో విప్ర ప్రముఖులు పాల్గొన్నారు.

రాష్ట్రంలో 3 డేటా సెంటర్లు!

దొడ్డబళ్లాపురం: రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధిలో భాగంగా శాశ్వత డేటా సెంటర్లను బెంగళూరు, మైసూరు, మంగళూరులో స్థాపించాలని గురువారం బెంగళూరులో జరిగిన మంత్రుల సమావేశంలో నిర్ణయించారు. ఇంధన మంత్రి కేజే జార్జ్‌, భారీ పరిశ్రమల శాఖ మంత్రి ఎంబీ పాటీల్‌, ఐటీ శాఖ మంత్రి ప్రియాంక్‌ ఖర్గే, అధికారులు హాజరయ్యారు. హొసకోట వద్ద 500 మెగావాట్ల సామర్థ్యం గల శాశ్వత డేటా సెంటర్‌ ఏర్పాటు చేయనున్నారు. పావగడ నుంచి సౌర విద్యుత్‌ను ఆ సెంటర్‌కు అందిస్తారు. మంగళూరులో డేటా పార్క్‌ ఏర్పాటుకు భూమి అందుబాటులో ఉందని,ఇక మైసూరులో భూమిని గుర్తించే పనిలో ఉన్నట్టు తెలిపారు. ఈ పార్క్‌లలో డేటా సెంటర్‌లు ఏర్పాటు చేస్తే వారికి విద్యుత్‌, నీరు అవసరమైనంత మేర అందిస్తామని తెలిపారు.

ఖర్గే సీఎం అయితే

ఓకే: యతీంద్ర

రాయచూరు రూరల్‌: ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సీఎం కావాలంటే, సిద్దరామయ్య ఆ పదవి నుంచి దిగిపోవాలి కదా? అని ఎమ్మెల్సీ యతీంద్ర సిద్దరామయ్య అన్నారు. ఖర్గే సీఎం అయితే స్వాగతిస్తానన్నారు. రాయచూరు తాలూకా కల్మఠలో కరియప్ప తాతా కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. డీసీఎం డీకే శివకుమార్‌కు పుట్టినరోజు కానుకగా హైకమాండ్‌ ఏమిచ్చినా సంతోషమని అన్నారు. మే 15న ఏమైనా జరగవచ్చన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement