మైసూరు: నగరంలోని ఒక ఫైనాన్స్ కంపెనీ తమ నుంచి బంగారం కుదువ పెట్టుకుని, ఇప్పుడు కరిగించేసిందని బాధితులు లబోదిబోమంటున్నారు. వివరాలు.. కువెంపునగరలోని ఆదిచుంచనగిరి రోడ్డులో ఉన్న ఒక ఫైనాన్స్ కంపెనీ మీద పోలీసు కమిషనర్‌కు పెద్దసంఖ్యలో బాధితులు ఫిర్యాదు చేశారు. మీ బంగారం తాకట్టులోఉంటే విడిపిస్తాం, ఆపై మంచి ధరకు మేమే కొంటాం.. అని మీడియాలో ప్రకటనలు చూసి చాలా మంది బంగారం యజమానులు ఆ ఫైనాన్స్ కంపెనీలో సంప్రదించారు. వారి సూచన మేరకు బంగారాన్ని తీసుకొచ్చి ఇచ్చారు. ప్రతి గ్రాము బంగారానికి రూ. 17,000 నుంచి రూ. 18,000 వరకు చెల్లిస్తామని కంపెనీ ఉద్యోగులు నమ్మబలికారు. బంగారం ఇచ్చిన తరువాత యజమానులకు చెప్పకుండా కరిగించారు. బంగారం స్వచ్ఛత అంత బాగా లేదని తక్కువ డబ్బు ఇచ్చి మమ్మల్ని మోసం చేశారని తెలిపారు.
అనుమానంతో..
భార్య నరికివేత
మైసూరు: అనుమానం పెనుభూతంగా మారి భార్యను హత్య చేశాడో కిరాతక భర్త. మైసూరులోని హలే కేసరిలో భార్యను గొడ్డలితో నరికి చంపాడు. వివరాలు.. పుష్ప (30) ఒక బట్టల షాపులో పనిచేసేది. బుధవారం రాత్రి, ఎప్పటిలాగే, పుష్ప పని ముగించుకుని ఇంటికి వచ్చినప్పుడు, భర్త ఆమెతో తీవ్రంగా గొడవపడ్డాడు. ఆ గొడవ తీవ్రరూపం దాల్చడంతో, భర్త కోపం పట్టలేక గొడ్డలితో పుష్పను నరికి హత్య చేశాడు. తరువాత నేరుగా నరసింహరాజ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి హంతకున్ని అరెస్టు చేశారు.
ఘనంగా కలశారోహణం
మైసూరు: జిల్లాలోని సరగూరు తాలూకా నంజీపురలోని కంఠే మడప్పన బెట్టపై శ్రీ మహదేశ్వర ఆలయం కలశారోహణ వేడుక ఘనంగా సాగింది. మహంతస్వామి, వివిధ మఠాల స్వామీజీల ఆధ్వర్యంలో జరిగింది. ఎమ్మెల్యే అనిల్ చిక్కమదు, ప్రముఖులు, వేలాది భక్తులు పాల్గొన్నారు.


